- 55 బృందాలుగా 8 చోట్ల తనిఖీలు
- నిర్మాతలు దిల్ రాజు, నవీన్ ఎర్నేని సహా బంధువుల ఇండ్లలో సోదాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాదులో 8 చోట్ల ఐటీ అధికారులు 55 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీ నిర్వహించారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల నివాసాల పై ఐటి శాఖ అధికారులు సోదాలు జరిపారు. ప్రముఖ నిర్మాత, ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు, సోదరుడు శిరీష్, ఆయన కుమార్తె హన్సిత రెడ్డి నివాసాలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ కార్యాలయం, మైత్రీ నవీన్, సీఈవో చెర్రీ, ఇందుకు సంబంధీకుల అందరి ఇళ్ళలోనూ సోదాలు నిర్వహించారు. అలాగే పుష్ప 2 చిత్రం నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు సతీమణి వైగారెడ్డిని కారులో తీసుకెళ్ళి బ్యాంకు లాకర్లను అధికారులు పరిశీలించారు. అనంతరం ఆమెను ఇంటి వద్ద విడిచిపెట్టారు. ఈ సోదాల్లో ఆయా నిర్మాతల ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన వివిధ పత్రాలను అధికారులు పరిశీలించారు. ఇదిలావుండగా, బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి తనను ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకెళ్ళినట్లు దిల్ రాజ్ భార్య వైగారెడ్డి తెలిపారు. బ్యాంకు వివరాలు కావాలని తనను అధికారులు కోరారని, ఆ మేరకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామన్నారు. కాగా, సంక్రాంతికి భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు దిల్ రాజు నిర్మించారు. అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్ చిత్రానికి దిల్ రాజు డిస్ట్రీబ్యూటర్ గా వ్యవహరించారు.