నాగేశ్వరరావు మార్గదర్శకాలు యువ న్యాయమూర్తులకు దిక్సూచిగా నిలుస్తాయి – హైకోర్టు న్యాయమూర్తి రేణుక యారా
నాగేశ్వర్రావు అందించిన మార్గదర్శకాలు యువ న్యాయమూర్తులకు దిక్సూచిగా నిలుస్తాయి
సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావుకు అభినందనలు….
సత్కరించిన హైకోర్టు న్యాయమూర్తి….
కోరుట్ల, ముద్ర;
భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయి పరిశోధన, వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి, జగిత్యాల జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి రేణుక యారా శాలువతో సత్కరించి, అభినందనలు తెలిపారు.

శనివారం కోరుట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి, అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా హైకోర్టు న్యాయమూర్తి హాజరయ్యారు. ఇటీవల మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావు నిర్వహించిన చట్టపరమైన పరిశోధనలను అలహాబాద్ హైకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రామాణికంగా స్వీకరించిన విషయం తెలిసిందే. పోలీసు దర్యాప్తులో పాటించాల్సిన చట్టబద్ధమైన విధానాలు, రక్షణలపై ఆయన చేసిన చేసిన పరిశోధనలను అలహాబాద్ హైకోర్టు, సుప్రీం కోర్టు రెండు కేసులలో ఉదహరించిన నేపథ్యంలో నాగేశ్వర్రావుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు న్యాయమూర్తి రేణుక యారా మాట్లాడుతూ మంథనిలో జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న కాలం నుంచి న్యాయపరిశోధన పట్ల చూపుతున్న నిబద్ధతను ఆమె అభినందించారు. నాగేశ్వర్రావు అందించిన మార్గదర్శకాలు దర్యాప్తు సంస్థలకు, యువ న్యాయమూర్తులకు దిక్సూచిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

జిల్లా న్యాయమూర్తి రత్నాపద్మావతి మాట్లాడుతూ మెట్పల్లి జ్యుడీషియల్ అధికారి, సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావుకు జాతీయ స్థాయిలో ఇలాంటి గుర్తింపు రావడం మన ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. ఆయన పరిశోధనలకు అలహాబాద్ హైకోర్టుతో సుప్రీంకోర్టు తీర్పుల్లో చోటు లభించడం అభినందనీయమని కొనియాడారు.
ప్రజలకు న్యాయం చేరువ చేసేందుకు అదనపు కోర్టులు-హైకోర్టు న్యాయమూర్తి రేణుక యార….

కోరుట్ల నియోజకవర్గం లో పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి, జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సముదాయంలో శనివారం మొదటి తరగతి అదనపు జూనియర్ సివిల్ జడ్జి, అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి రేణుక యార ప్రారంభించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పూల బొకే అందించారు. ఈ నూతన కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని, కోరుట్ల ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి రేణుక యార సూచించారు. ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. ఈసందర్భంగా కోరుట్ల కోర్టుకు వచ్చిన న్యాయమూర్తికి ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సర్వ మత పెద్దల సమక్షంలో పాస్టర్, ముస్లిం మత గురువు కరీం మౌలానా ప్రార్థన చేసి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీసుల గౌరవ వందనాన్ని హైకోర్టు న్యాయమూర్తి రేణుక యార స్వీకరించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడాతూ కరీంనగర్ జిల్లా కోర్టులో తాను గతంలో న్యాయమూర్తిగా పని చేశానని చెప్పారు. జిల్లా ప్రజలతో మంచి అనుబంధం ఉందన్నారు. కోరుట్లలో అదనపు కోర్టు ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. కోరుట్లలో వెటర్నరీ కళాశాల ముందు నూతనంగా నిర్మిస్తున్న కోర్టులో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తానని న్యాయమూర్తి చెప్పారు. కోరుట్ల కోర్టులో రెగ్యులర్ న్యాయమూర్తి నియామకానికి చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం కూచిపూడి నాట్యంతో అలరించిన విద్యార్థినిలకు న్యాయమూర్తి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి రత్న పద్మావతి, అడిషనల్ జిల్లా న్యాయమూర్తి సునీత రవీందర్‌రెడ్డి, మెట్‌పల్లి సబ్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు, జగిత్యాల సబ్ కోర్టు జడ్జి వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ, కోరుట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి పావనీ, మెట్‌పల్లి సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి అరుణ్ కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి, బార్ అసోసియోషన్ అధ్యక్షుడు తోట ఆంజనేయులు, సీనియర్ న్యాయవాదులు ముబీన్ పాషా , చెన్న విశ్వనాథం, బోయిని సత్యం, అబ్దుల్ హఫీజ్, ఏపీజీ గోనె రాజేష్ ఖన్నా, కోరుట్ల, మెట్ పల్లి, జగిత్యాల బార్ అసోసియోషన్ న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు.