ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు వివిధ మండలాల్లో అధికారులు గ్యాస్ ఏజెన్సీలలో ఆకస్మిక తనిఖీలు శనివారం నిర్వహించారు. తహసిల్దార్లు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఏజెన్సీలలో తనిఖీలు చేశారు. ఆయా మండలాల్లో గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల్లో స్టాక్, అమ్మకానికి సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. అన్ని రకాల రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. గోదాములలో గల సిలిండర్లను పరిశీలించారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులలో సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించవద్దని ఆదేశించారు. ప్రజల అవసరాల మేరకు సిలిండర్లను అందించాలని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ లో అమ్మినా, పక్కదారి పట్టించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల కొనుగోలు నిమిత్తం వచ్చిన ప్రజలతో పలువురు అధికారులు మాట్లాడారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, ప్రజల అవసరాల మేరకు సిలిండర్లను అందిస్తామని తెలిపారు. ప్రజలు గ్యాస్ సిలిండర్ల విషయంలో భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని వివరించారు.