Take a fresh look at your lifestyle.

నిగ్గదీసి.. నిలదీసి..! రాష్ట్రంలో రచ్చలేపిన గ్రామ సభలు

  • ఆరు గ్యారంటీల అమలు, రేషన్ కార్డులు,ఇందిరమ్మ లబ్దిదారుల ఎంపికపై భగ్గుమన్న జనం
  • తులం బంగారం, రుణమాఫీపై నిలదీసిన వైనం
  • ప్రజల నిరసనలతో వెనుదిగిరిన అధికారులు
  • పలు చోట్ల పోలీసు బందోబస్తు నడుమ గ్రామసభలు
  • దరఖాస్తులపై వివరాలు సేకరించిన అధికారులు
  • బీజేపీ, కాంగ్రెస్​ ఎమ్మెల్యేలకు నిరసన సెగ
  • మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రసంగాన్ని అడ్డుకున్న ప్రజలు
  • సహనం కోల్పోయి సభ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే
  • ఆర్మూర్​ లో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ ​రెడ్డిని నిలదీసిన జనం

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గ్రామ సభలు రచ్చలేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారంటీలు… ఇచ్చిన హామీల అమలు కోరుతూ నిలదీతలు మొదలయ్యాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తోన్నా అమలుకు నోచుకోని హామీలపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రజా పాలన ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తిరుగుబావుటా ఎగురవేశారు.రేషన్ కార్డులు.. ఇందిరమ్మ ఇండ్లు.. ఇందిరమ్మ పింఛన్లు, ఆత్మీయ భరోసా, ఇతర సంక్షేమ పథకాల అమలుకు దరఖాస్తులు స్వీకరించేందుకు మంగళవారం నుంచి ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలు ప్రజల నిరసనలతో దద్దరిల్లాయి.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలకు హాజరైన ప్రజలు ఆరు గ్యారంటీల అమలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ లబ్దిదారుల ఎంపిక తీరుపై అధికారులను నిలదీశారు. రేషన్ కార్డుల జాబితాలో తమ పేరు లేదని, తమకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదంటూ ఆందోళనకు దిగారు. అధికారులు ప్రకటించిన రేషన్ కార్డుల జాబితాలో అనర్హులకు అందలమెక్కించిన సర్కార్ తీరుపై మండిపడ్డ అర్హులు పలు చోట్ల సభలను అడ్డుకున్నారు.గతంలో ప్రభుత్వం చేసిన సర్వేలు ఏమాయ్యాయని ప్రశ్నించిన ప్రజలు తాము ఇచ్చిన దరఖాస్తులు ఏం చేశారంటూ విరుచుకుపడ్డారు. ఆ సభల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేతలను నిలదీశారు.అధికారులు గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు. ప్రజా ఆందోళనలతో ఏం చేయాలో తోచక పలుచోట్ల అధికారులు సభలను వదిలి అక్కడ్నుంచి జారుకోగా… ఇంకొన్ని చోట్ల పోలీసు బందోబస్తుతో సభలు కొనసాగించారు. మొత్తానికి గ్రామస్థుల నిలదీతలు, గందరగోళ పరిస్థితులతో గ్రామసభలు రసాభసగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందంటూ ఆందోళనకు దిగారు.

ఎమ్మెల్యేలకు నిరసన సెగ..!

గ్రామ సభల వేళ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు నిరసన సెగ మొదలైంది. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రభుత్వం చేపట్టిన గ్రామసభలకు హాజరయ్యేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలను నియోజకవర్గ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై నిలదీస్తున్నారు. సభలో వారి ప్రసంగాలను అడ్డుకుంటున్నారు. ముందుగా హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీ పూర్ గ్రామ సభలో అధికార పార్టీకి చెందిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను ప్రజలు నిలదీశారు. ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదని నిరసన వ్యక్తం చేశారు.

రైతు భరోసా ఏదని ప్రశ్నించిన రైతులు తమకు పంట రుణమాఫీ జరగలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. ఆరుగ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యకం చేసి కవ్ పల్లి ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక సహనం కోల్పోయిన ఎమ్మెల్యే వారిపై విరుచుకుపడ్డారు. ఆగ్రహంతో ఊగుతూ ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి మధ్యలోనే వెళ్లిపోయారు. మరోవైపు..ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామసభలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ప్రజలు అడ్డుకున్నారు. ఏం మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావంటూ నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు గ్రామంలో పది ఇండ్లు కట్టిస్తానని ఇచ్చిన హామీని ఇంత వరకు ఎందుకు అమలు చేయలేదంటూ మండిపడ్డారు. ప్రజల నిలదీతతో ఖంగుతిన్న రాకేశ్​ రెడ్డి.. అధికారులపై మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్​ కార్డులు, ఇతర పథకాల అమలు విషయంలో అధికార పార్టీ చేస్తున్న జాప్యానికి తాము బలవుతున్నామని చెప్పారు. అయినా ప్రజలు శాంతించకపోవడంతో అక్కడ నుండి వెళ్లిపోయారు.

మిన్నంటిన ఆందోళనలు.. అధికారుల అడ్డగింతలు

మంచిర్యాల జిల్లా భీమారం మండలం పొలంపెల్లి గ్రామసభలో మొదటి విడత రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు రాలేదని, గ్రామ సభను రద్దుచేసి మళ్లి గ్రామంలో సర్వే చేపట్టి అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు. కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో రేషన్ కార్డుల జాబితాలో తమ పేరు లేదని, తమకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదని పేదలు ఆందోళన నిర్వహించారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఏడ్ బిడ్ గ్రామంలో నిర్వహించిన సభలో ప్రజలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లపై అధికారులు, కాంగ్రెస్ నేతలను నిలదీశారు. గతంలో ప్రభుత్వం చేసిన సర్వేలు, తాము ఇచ్చిన దరఖాస్తులు ఏం చేశారని ప్రశ్నించారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గ్రామసభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.బోధన్ మండలం కల్దుర్కి, పెగడపల్లి, ఏరాజ్పల్లి, పెంటఖుర్ద్, హాంగర్గ, జాడిజమాల్ పూర్, సాలంపాడ్, మినార్ పల్లి గ్రామ సభలో పాల్గొన్న ప్రజలు, అధికారుల మద్య వాగ్వాదం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్ నాయకులకే పెద్దపీట వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలుఆత్మీయ భరోసాలో అనేకమంది పేర్లు గల్లంతు కావడంతో మండిపడ్డారు. రేషన్ కార్డ్ ఎంపిక ప్రక్రియలో అర్హులకు అన్యాయం జరుగుతుందంటూ అధికారుల నిలదీశారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన మండల కేంద్రంలోని గ్రామసభలో రసాభసగా మారింది. అర్హులైన పేదలకు కాకుండా అనర్హులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారంటూ గ్రామస్తులు అధికారులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసి వారితో వాగ్వాదానికి దిగారు.సూర్యాపేట వార్డ్ నెంబర్ 1లోని వార్డు సభలో, సూర్యాపేట మండలం పిల్లల మర్రి గ్రామంలోని గ్రామ సభలను ప్రజలు అడ్డుకున్నారు. నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందడం లేదని మండిపడ్డ నిరసనకారులు తమకు న్యాయం చేసిన తర్వాతే సభలు నిర్వహించాలని హెచ్చరించారు. గుంట భూమి లేని,వికలాంగులకు కాకుండా, ఆర్ధికంగా బలంగా ఉన్న వారికి భూములున్న వారికి ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేర్లు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్త చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన అధికారులు సభ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిలో గ్రామసభలో ఆరు గ్యారెంటీల గురించి ప్రశ్నించిన ప్రజలు తమకు రూ. రెండు లక్షల రుణ మాఫీ కాలేదని నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ప్రకటించిన తులం బంగారం ఇవ్వలేదు.. రైతు భరోసాకు ఇంతవరకు జాడ లేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పెద్దపల్లి నియోజకవర్గం బోంపల్లి గ్రామ సభలో గ్రామస్తులు అధికారులపై తిరగబడ్డారు. గుంట భూమి లేని వారి పేరు ఇందిరమ్మ, రేషన్ కార్డుల అర్హుల జాబితాలో లేవు కానీ పదెకరాలు ఉన్న వారి పేర్లు లిస్టులో ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డుల కోసం ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులను నిలదీశారు.మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో గ్రామ సభలో అధికారులను నిలదీసిన ప్రజలు ఘట్కేసర్ మున్సిపాలిటీ ఆంక్షపూర్ లో నిర్వహించిన గ్రామసభ రసాభసాగా మారింది. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పై వివాదం తలెత్తింది. కాంగ్రెస్ నాయకులు స్థానిక కౌన్సిలర్‌కు తెలియకుండా ఇందిరమ్మ కమిటీలు ఎన్నుకోవడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఇటీవల​ అధికారులు ప్రకటించిన జాబితాలో పార్టీలకు అతీతంగా అర్హుల పేర్లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు పంచాయతీలో ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ మహిళలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంపిక చేశారని ఆగ్రహించిన గ్రామస్తులు అధికారులపై మండిపడ్డారు. సభ నిర్వహించకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు గ్రామసభ మధ్యలోనే వెనుదిరిగారు. వనపర్తి జిల్లా పాన్ గల్ మండలం అన్నారం గ్రామంలో గ్రామ సభను బహిష్కరించిన గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇందిరమ్మ జాబితాలో తమ పేర్లు లేవంటూ మండిపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. భూములున్న వారికే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు నమోదు చేయడంతో సిరిసిల్ల పట్టణంలోని 5వ వార్డు సభను బహిష్కరించిన మహిళలు ఏకంగా సీఎం రేవంత్​ రెడ్డిని దుర్భాషలాడారు.మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం అలియాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్ల జాబితాపై ప్రజలు అధికారులను నిలదీశారు.

నిజమైన లబ్దిదారులకు అన్యాయం జరిగిందంటూ ఆందోళన చేపట్టారు. ప్రజల తిరుగుబాటుతో అధికారులు తోక ముడిచారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పేట గ్రామంలో డబ్బులున్న వారికి పథకాలు ఇస్తున్నారని, పేదలకు అన్యాయం చేస్తున్నారంటూ గ్రామస్తులు అధికారులను నిలదీశారు.యాదాద్రి భువనగిరి జిల్లా రాయరావు పేట గ్రామసభలో లిస్టులో తమ పేర్లు లేవంటూ గ్రామస్తులు అధికారులను నిలదీశారు. అక్కడున్న పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది.జనగామ – జాఫర్ ఘడ్ మండలం కూనూరులో గ్రామసభ రసాభాసగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ప్రజలు ఇండ్లు ఉన్న వారికే మళ్లి ఇండ్లు మంజూరు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిర్వహించిన సర్వే లోపభూయిష్​టంగా ఉందనీ దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో గ్రామసభను బహిష్కరించి నిరసన తెలిపారు.మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల జాబితాపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం బోయిన్ పల్లి మండలం రత్నంపేటలో గ్రామ సభలో తమకు రుణమాఫీ కాలేదని, పథకాలు అందడం లేదని స్థానిక రైతులు అధికారుల ముందు ఆందోళనకు దిగారు.

నిజామాబాద్ – బాల్కొండ నియోజకవర్గం కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల జాబితా రూపకల్పన, ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై ప్రజలు ఆందోళన చేపట్టారు. సభ నిర్వహించకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీస్ బందోబస్తుల నడుమ గ్రామ సభలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా పాలమాకుల గ్రామ సభలో గ్రామస్తులకు,అధికారులకు మధ్య వాగ్వాదం జరగగా..ప్రజలు సభను బహిష్కరించారు.మంచిర్యాల – భీమారం మండలం పొలంపెల్లి గ్రామసభలో ప్రజలు ఆందోళన చేపట్టారు. రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు లేవంటూ నిరసన తెలిపిన గ్రామస్తులు గ్రామ సభను రద్దు చేసి మళ్లి సర్వే చేపట్టి అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కనుగుట్ట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు,పెన్షన్ల కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్న జాబితాలో పేర్లు రావడం లేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్​ శ్రేణులను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని తిరగబడ్డారు. తమకు అసలు పథకాలు వస్తాయా..? రావా..? ఏదో ఒకటి చెప్పాలని డిమాండ్​ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని గ్రామసభలో ప్రజలు నిరసన తెలిపారు.ఇందిరమ్మ అర్హుల జాబితాలో అనర్హుల పేర్లు ఉండడంతో అధికారులపై మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.