Take a fresh look at your lifestyle.

రెండేళ్లలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

పెండింగ్ ప్రాజెక్టులన్నీ రెండేళ్లలో పూర్తి
ప్రాజెక్టుల భూ సేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు తెలంగాణలో ప్రతీ ఎకరాకు సాగు నీరందిస్తాం
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు గాలికి వదిలేయం
నిపుణుల సూచనల మేరకు కాళేశ్వరానికి మరమ్మత్తులు
దేవాదుల భూసేకరణ కోసం రూ. 600 కోట్లు మంజూరు చేస్తాం
గోదావరి జలాల వివాదానికి రాజకీయరంగు
967 టీఎంసీల వాటాను వాడుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు
గత ప్రభుత్వం కాళేశ్వరం తప్ప మిగిలిన ప్రాజెక్టులను పట్టించుకోలేదు
జలాల విషయంలో ఏపీకి సహకారం పచ్చి అబద్దం
సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటాం
ఎన్నికలప్పుడే రాజకీయం.. ప్రజల నీళ్ల విషయంలో కాదు
దేవాదుల ప్రాజెక్టు పురోగతి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

  

వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆయా సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణలోని ప్రతీ ఎకరాకు నీరందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగం కానివ్వబోమన్న సీఎం.. దాని మరమ్మత్తు కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నిపుణుల కమిటీ సూచనలతో మరమ్మత్తులు చేపడతామన్నారు. ప్రస్తుతం అక్కడి భూమి లోపల ఎలాంటి మార్పులు వచ్చేయో ఏజెన్సీ లు పరిశీలిస్తున్నాయని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు భవిష్యత్ లో ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను గాలికి వదిలేసే ప్రసక్తే లేదన్నారు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టులను నిరుపయోగంగా ఉంచమన్నారు. ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. నిధులు,నీళ్ల తో తెలంగాణ ఏర్పాటు అయిందన్న సీఎం.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్ట్ లు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహిత,ఎస్సారెస్పీ. దేవాదుల లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసి 967 టీఎంసీ వాటాను వినియోగించుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అప్పుడు వరద జలాల్లో వాటా అడిగే పరిస్థితి ఉండేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ నేతల స్వార్థ రాజకీయంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పారు. గత ప్రభుత్వం గోదావరి పై కాళేశ్వరం తప్ప మిగిలిన ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆరోపించారు. కమీషన్ల కోసం ఒకే ఒక్క ప్రాజెక్టు మీద లక్ష కోట్లు ఖర్చు చేసిందన్నారు. రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టు గొప్పది అనుకునేలోపే కుప్పకూలిందని ఎద్దేవా చేశారు. ఆయా ప్రాజెక్టులపై నిర్లక్ష్యంతో ఇప్పుడు మిగతా ప్రాజెక్టులకు, భూసేకరణకు నిధుల కొరత ఏర్పడిందని చెప్పారు. అయినా కఠిన పరిస్థితులు అన్నీ అధిగమించి వచ్చే రెండు, మూడేళ్లలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం స్పష్టం చేశారు. కాళేశ్వరం కింద నీరు ఎత్తిపోయనప్పటికీ రాష్ట్రంలోనే అత్యధికంగా వరి దిగుబడి వస్తోందని చెప్పారు. రూ.6 వేల కోట్ల అంచనాలతో మొదలుపెట్టిన దేవాదుల ప్రాజెక్టు నేడు రూ.18 వేల కోట్లు అవసరమైన స్థితికి చేరుకుందన్నారు.

దేవాదుల భూసేకరణ కోసం రూ.600 కోట్లు
2001 లో దేవాదుల కు చంద్రబాబు శంకుస్థాపన చేస్తే ఇప్పటి కి నిర్మాణం కొనసాగుతుందన్న సీఎం… చిత్తశుద్ధితో నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్న తమకు నిధుల కొరత వేధిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంపై రూ. 8.11 లక్షల కోట్ల అప్పు భారం ఉందన్నారు. అయినా జూన్ 2 లోపల దేవాదుల భూసేకరణ కోసం రూ.600 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. బడ్జెట్ లోపే అన్ని అంచనాలను ప్రభుత్వం ముందు ఉంచి ఆమోదం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్చిలో మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంచనాలకు ఆమోదం తెలుపుతామని వివరించారు. దేవాదుల పంప్ ను నెల రోజుల వ్యవధిలో మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో దేవాదులపై కమిటీ హాల్ లో ఎమ్మెల్యేలు,అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. అ ప్రాజెక్టుల భూ సేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిహారానికి సంబంధించిన నిధులను గ్రీన్ ఛానల్ మంజూరు చేస్తామని చెప్పారు. భూసేకరణ జాప్యంతో సాగునీటి ప్రాజెక్టుల పనులు ఆగడానికి వీలు లేదన్న సీఎం.. రామప్ప చెరువు నుంచి జంపన్న వాగు కు నీరు అందించే ప్రణాళికపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

గోదావరి జలాలను వదులుకోం


గోదావరి జలాల వివాదం రాజకీయరంగు పులుముకుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జలాల విషయంలో తాము ఏపీకి సహకరిస్తున్నామనేది పూర్తి అసంబద్ధమన్నారు.ఉత్తర తెలంగాణ ను సస్యశ్యామల చేసే సమయం లో ఆరోపణలు,అబద్ధాల ప్రచారాలతో ప్రయోజనం లేదని హితవు పలికారు. గోదావరి నికర,వరద జలాల్లో తెలంగాణ హక్కుల్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని వదులుకోబోమని సీఎం తేల్చి చెప్పారు. గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో 960 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్టులు కట్టి ఉంటే అసలు ఈ వివాదమే ఉండేది కాదన్నారు. ఇకనైనా ప్రాజెక్టులు పూర్తి చేసి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకుందామన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దామన్న సీఎం.. ప్రజలు, నీళ్ల విషయంలో కాదన్నారు. పలు ఎన్నికల్లో ప్రజల తీర్పు చూశాక కూడా బీఆర్‌ఎస్‌ నేతలు మారలేదని చురకలంటించారు. బీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించకపోవడం ప్రజల తప్పన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు, సాగునీటి విషయంలో ప్రజలను తప్పుపట్టడం మానేసి.. విజ్ఞతగా వ్యవహరించాలని ప్రతిపక్ష నేతలకు సూచించారు. గోదావరి జలాల పైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒక రోజు చర్చ చేద్దామని సవాల్ చేశారు. అందులో బీఆర్ఎస్ నేతలు పదేళ్ల తమ పాలన అనుభవం, సాధించి విజయాలు,మా తప్పిదాలు ఏంటో సభా వేదికగా ప్రజలకు వివరించాలన్నారు. రెండేళ్ల తమ పాలనలో తమ తప్పిదాలు ఉంటే వాటిని సవరించుకుంటామన్నారు. తెలంగాణ పోటీ చేసి ప్రజా ప్రతినిధి ఎవరైనా ఏపీ కి సహకరిస్తారా? అని ప్రశ్నించారు. చవక బారు ఆరోపణలతో లాభం లేదన్న రేవంత్ రెడ్డి.. సాగునీటి ప్రాజెక్టులు, పాలన లోపాలపై సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. ప్రజా పాలన విషయంలో తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్‌, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.