Take a fresh look at your lifestyle.

మేయర్ పీఠం టెన్షన్.. టెన్షన్…!

– సీల్డ్ కవర్ లో మేయర్ అభ్యర్థుల పేర్లు
– పలు చోట్ల కుదరని పొత్తులు
– హంగ్ లో కూడా కింగ్ కావాలని చూస్తున్న కాంగ్రెస్
– 19 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కి ఇప్పటికీ ప్రకటించని మేయర్ అభ్యర్థి పేరు
– అయోమయం లో మేయర్ పదవి ఆశావహులు
– నేటితో టెన్షన్ కు తెర పడనున్న మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపిక
……………………………………..
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….

నిన్నటి దాకా ఒక లెక్క… నేడు ఒక లెక్క…మేయర్ పీఠం పై వేసుకున్న లెక్కలన్నిటికీ నేటి తో తెరపడనుంది. ఆశావాహుల్లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. మేయర్ పదవి ఆశిస్తున్న అభ్యర్థులు పీఠం దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నంలో వారు నిమగ్నమయ్యారు. ఇప్పటికే గెలిచిన అభ్యర్థులు ఎమ్మెల్యే ల సమక్షంలో విహార యాత్రల్లో విహరిస్తున్నారు. అయినా మేయర్, చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అని ఒక పక్క టెన్షన్ లో ఉన్నారు. మొదటి సారిగా మున్సిపల్ కార్పొరేషన్ అయిన మహబూబ్ నగర్ కు మొదటి మేయర్ ఎవరనే దానిపై కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. ఈ పదవి పై ఇప్పటికే ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. 49 డివిజన్ నుంచి గెలుపొందిన ప్రసన్న, 58 డివిజన్ నుంచి ఎన్నికైన రమాదేవి పేర్లు అధిష్టానం పరిశీలిస్తోంది.కానీ ఈ రెండు రోజుల నుంచి కొత్త పేరు తెర పైకి వచ్చింది. మైనార్టీ వర్గానికి ఇవ్వాలనే ఉదేశ్యం లో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పాలమూరులో బీసీ వర్గాలు ఉద్యమించే అవకాశం లేకపోలేదు. మైనారిటీ లను బీసీ ల్లో కలిపింది ఇందుకేనా అని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే జరిగితే మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ దిక్కు లేకుంకుండా పోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసిన బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆదివారం ఆ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని మేయర్ పదవి దక్కకుంటే ఏమిచెయ్యాలోఅనిచర్చించారు.ఏమి జరుగుతుందో నేడు బయటపడుతుంది.60 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్ లో 31 డివిజన్ల లో విజయం సాధిస్తే మేయర్ పీఠం దక్కుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కి 29 రావడం తో ముగ్గురు మైనార్టీ లు, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మేయర్ పీఠం దక్కించుకొంటుంది. కానీ మేయర్ ఎవరనే దానిపై టెన్షన్ వీడడం లేదు.ఈ మేయర్ ఎవరినేది సీల్డ్ కవర్ దాచి ఉంచారు.
……………………………………..
గద్వాల లో ఇంకా వీడని సస్పెన్స్ :
………………………………………
జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపాలిటీ లో ఇంకా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడి మున్సిపాలిటీ లో 37 వార్డులకు గాను 19 వార్డులు మేజిక్ ఫిగర్ గా ఉన్నాయి. కానీ ఏ పార్టీ కూడా మేజిక్ ఫిగర్ ను దాటలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 16 మంది గెలుపొందగా, బీ ఆర్ ఎస్ నుంచి 11,బీజేపీ నుంచి 7,స్వతంత్రులు 3 గెలుపొందారు. ఎవ్వరికీ సరైన మెజారిటీ రాకపోవడం తో స్వతంత్రుల పై ఆధారపడి వస్తోంది. ఇప్పటికే ఇక్కడి ఎమ్మెల్యే బీ ఆర్ ఎస్ అని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ గెలిచిన అభ్యర్థుల తో పాటు ఇద్దరు స్వతంత్రులను కర్ణాటకలోని ఓ రిసార్ట్ కు తరలించారు. ఇద్దరు స్వతంత్రులను కలుపుకొన్న కాంగ్రెస్ మెజారిటీ 18 స్థానాల్లో ఉంది. చైర్మన్ పీఠం దక్కాలంటే మరో అభ్యర్థి మద్దతు ప్రకటించాలి. ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓటుతో 19 స్థానాలు భర్తీ అయి చైర్మన్ పదవి కాంగ్రెస్ కు దక్కుతుంది. కానీ ఇక్కడే ఓ తిరకాసు ఉంది. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగించుకుంటే చిక్కుల్లో పడతారు. ఈయన పై అనర్హత వేటు పడుతుందని ఇదివరకే తాను బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అని స్పీకర్ ఎదుట ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే ఆయన ఎమ్మెల్యే పదవి ని కోల్పోయే అవకాశం ఉండడం తో ఆయన ఓటు వేయక పోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈయన ఓటు వినియోగించుకోకుంటే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం దక్కలంటే ఇంకా ఒక అభ్యర్థి మద్దతు అవసరం. కానీ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎంపీ మల్లు రవి తన ఎక్స్ అఫిషియో ఓటును గద్వాల లో ఉపయోగించుకుంటే చైర్మన్ పదవి కాంగ్రెస్ కు లైన్ క్లియర్ అవుతుంది. కానీ ఆయన ఓటు అలంపూర్ మున్సిపాలిటీ కి కూడా అత్యవసరం ఉంది. ఆయన ఎక్కడ ఉపయోగించుకుంటారో వేచిచూడాలి. నేడు చైర్మన్ ఎన్నిక ఎలా జరుగుతుందో అని అంతా టెన్షన్ లో ఉన్నారు.
………………………………….
అలంపూర్ లో ఉత్కంఠ :
…………………………………..
అలంపూర్ మున్సిపాలిటీ లో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడి 10 కౌన్సిల్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కి 5, బీ ఆర్ ఎస్ కు 5 చొప్పున గెలుచుకున్నాయి. సమానమైన స్థానాలు రావడం తో చైర్మన్ పదవి దక్కలంటే ఇంకా ఒక స్థానం దక్కాలి. ఇక్కడ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు. ఈయన ఎక్స్ అఫిషియో సభ్యుని ఓటు వినియోగించు కుంటే చైర్మన్ పదవి దక్కుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎంపీ మల్లు రవి కూడా ఎక్స్ అఫిషియో సభ్యుని ఓటు వినియోగించుకుంటే మళ్ళీ సమానమైన ఓట్లు వస్తాయి. ఈ విషయం తేలక పోవడం తో చైర్మన్ పదవికి డ్రా పద్ధతి ని అధికారులు ఉపయోగించే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం హంగ్ ఉన్న మున్సిపాలిటీ లలో కింగ్ కావాలని పావులు కదుపుతోంది.
……………………………………..
అమరచింత లో అదే సీన్ :
…………………………………….
అమరచింత మున్సిపాలిటీ లో మరింత గందరగోళం ఏర్పడింది. ఇక్కడ 10 వార్డులు ఉండగా ఇందులో కాంగ్రెస్ కు 3,బీ ఆర్ ఎస్ కు 3,బీజేపీ కి 3,ఒకటి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. చైర్మన్ పదవి దక్కలంటే 6 మంది సభ్యుల బలం కావాలి. ఇది ఏ పార్టీ కి లేదు. మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి ఎక్స్ అఫిషియో సభ్యుని హోదా లో ఓటు వేసినా మేజిక్ ఫిగర్ దాటదు. ఇక్కడ బీ ఆర్ ఎస్, బీజేపీ కలిసి చైర్మన్ పదవి దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా కొందరు బీ ఆర్ ఎస్ అభ్యర్థుల మద్దతు కూడగట్టె ప్రయత్నం జరుగుతోంది. చైర్మన్ పదవి దక్కడం కోసం మంత్రి ఎలా చక్రం తిప్పుతారో వేచిచూడాలి.
మిగతా అన్ని మున్సిపాలిటీ లలో చైర్మన్ అభ్యర్థి ని నేడు ప్రకటించే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.