Take a fresh look at your lifestyle.

వేధించిన వారిని వదలను -హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

పోలీసు ఉన్నతాధికారులు వారికి వారే చిక్కులు కొనితెచ్చుకుంటున్నారు

ముద్ర, హుజూరాబాద్ :

చెప్పని మాటలు చెప్పినట్టు అభూత కల్పనలు సృష్టించి తనను వేధిస్తోన్న వారు ఎంతటి వారైనా ఎవరినీ వదలే ప్రసక్తే లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో మళ్లీ అధికారంలో రావడం ఖాయమన్న ఆయన అప్పుడు అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు వారికి వారే చిక్కులు కొనితెచ్చుకుంటున్నారని హెచ్చరించారు. గురువారం హుజూరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ మతమార్పిడులకు పాల్పడుతున్నారని తాను అన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధమేనని సవాల్ చేశారు. కరీంనగర్ సీపీని అసలు ఆ మాట అనలేదని స్పష్టం చేశారు. తనను వేధించాలనే తప్పుడు కేసు నమోదు చేసి సీఐడీతో విచారణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మినీ మేడారం జాతరకు 50 మందితో వెళ్లానని చెబుతోన్న పోలీసులు.. అంతమందితో వెళ్లినట్లు నిరూపిస్తే క్షణం ఆలోచించకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. అధికార పార్టీ, అందులో పని చేసే కొందరు ఉన్నత స్ధాయి అధికారులు కావాలనే తనను టార్గెట్ చేశారన్నారు. ఇదీలావుంటే ఈ వ్యవహారంపై పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి క్షమాపణలు చెప్పారు. ‘ఎవరినీ ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు.. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో నాపై, నా కుటుంబంపై రాజకీయ కక్షకు తెగబడ్డారు. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారాను. అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావు. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని గతంలోనే అభ్యర్థిస్తూ కౌశిక్ రెడ్డి సారీ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.