Take a fresh look at your lifestyle.

హామీల అమలు లేకే ఎన్నికల్లో నిలబడలేదు

  • సిఎం మారారే తప్ప ప్రభుత్వం కాదు
  • 32 జిల్లాలకు జాతీయరహదారి తో అనుసంధానం మోది చలవే
  • భైంసా సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక గెలిచే అవకాశం లేనందునే బి ఆర్ ఎస్, కాంగ్రెస్ నేరుగా అభ్యర్థులను నిలపలేదని కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి,రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు.ఏ ఒక్క వర్గం కూడా ప్రభుత్వంపై సంతృప్తితో లేరని ఆయన ధ్వజమెత్తారు.నిర్మల్ జిల్లా భైంసా లో జరిగిన ఎంఎల్సి ఎన్నికల సమావేశంలో ఆయన ప్రసంగించారు.గత ఎన్నికల సమయంలో 100 రోజుల్లో నెరవేరుస్తామన్న ఆరు హామీలతో సహా 420 హామీలు కేవలం నీటి మూటలయ్యాయని ఆరోపించారు.గత ప్రభుత్వ హయాంలో ఎరువుల కోసం క్యూ లో చెప్పులు పెట్టిన రైతాంగానికి నేడు ఆ పరిస్థితి లేదన్నారు.ఇందుకు మోది ప్రభుత్వం ఎరువుల ఉత్పత్తి పెంచటమే కారణమని అన్నారు.యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం ఊసే లేదన్నారు.దళితులకు రూ.12 లక్షల హామీ తుంగలో తొక్కారన్నారు.విద్యార్థినులకు స్కూటీ లు ఇస్తామన్న హామీ మరిచి పోయారన్నారు.కౌలు రైతులకు ఆర్థిక సహాయం తుంగలో తొక్కారన్నారు.సిఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు సచివాలయానికి పరిమితం అయ్యాయన్నారు. కాగా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టి ఇచ్చాకే స్థానిక ఎన్నికల్లో పాల్గొంటామన్న రేవంత్ రెడ్డి మాటలతో వారు ఎన్నికల్లో నిలబడే అవకాశం లేనట్లు కనబడుతుందని ఎద్దేవా చేశారు.ఎన్నికల్లో భాగంగా మోడీ ఇచ్చిన గిట్టుబాటు ధరల హామీ, రైతులకు పంటల బీమా,ఎరువుల అందుబాటు వంటి అంశాలతో రైతాంగం సంతృప్తితో ఉందని అన్నారు.గత దశాబ్దానికి పైగా బి ఆర్ ఎస్,కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రామ పంచాయితీల అభివృద్ధికి నిధులు విదల్చలేదని అన్నారు. కేంద్రం మంజూరు చేసిన నిధులతోనే గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, తదితర సౌకర్యాలు చేకూరాయని అన్నారు.

కడుపులో పెట్టుకుంటాం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు బీజేపీ పట్ల చూపుతున్న అభిమానం మరవలేమని,ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. ముధోల్, నిర్మల్,ఆదిలాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో బీజేపీ కి పట్టం కట్టిన ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని అన్నారు.రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులు కొమురయ్య,అంజి రెడ్డిలను భారీ మెజారిటీ తో గెలిపించి మరోమారు ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ లు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్,పాయల్ శంకర్, తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.