ముద్ర, తెలంగాణ బ్యూరో : మాజీ రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కె. కేశవరావు (కేకే) కుటుంబ సభ్యుల స్థలం క్రమబద్ధీకరణపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాలవ్యాజ్యం (పిల్) దాఖలైంది. బంజారాహిల్స్ లోని ఎన్ బీటీ నగర్ లో ఉన్న భూమిని తక్కువ ధరకు జీవో నెంబర్ 56 ద్వారా కేటాయించారని రఘువీర్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
రెవెన్యూ అధికారులు, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీపీఏ హోల్డర్ కవితను ప్రతివాదులకుగా చేర్చారు. స్థలం కేటాయిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం బుధవారం నాడు విచారణ చేపట్టింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రతివాదులు సమయం కోరడంతో తదుపరి విచారణను హైకోర్టు ఫిబ్రవరి 27 నాటికి వాయిదా వేసింది.