బాగ్ లింగంపల్లి గోదాములో ఆకస్మిక తనిఖీ
ముద్ర, హైదరాబాద్ :
రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తోన్న సన్నబియ్యం నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు. పేద ప్రజలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యంతో భోజనం చేయాలన్న మహత్తర సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. వాశురం హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న సివిల్ సప్లైస్ గోదామును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు రెండు గంటలపాటు గోదాములో నిల్వ ఉన్న బియ్యం సంచులను యాదృచ్ఛికంగా తెరిపించి నాణ్యతను స్వయంగా పరిశీలించారు. బియ్యం లో నూకల శాతం, తేమ శాతం వంటి అంశాలపై అధికారులను ప్రశ్నించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గోదాముకు వచ్చిన బియ్యాన్ని స్వీకరించే దశలోనే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్న ఆయన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిల్వలను తిరస్కరించాలని గోదాం ఇన్‌చార్జీలకు సూచించారు. ఈ విషయంలో ఏం మాత్రం రాజీపడినా కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. ప్రజలకు చేరే ప్రతి బియ్యం గింజ నాణ్యమైనదిగా ఉండేలా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. గోదాములో పని చేస్తున్న హమాలీలతో మాట్లాడిన కమిషనర్ వారి పని వాతావరణం, సౌకర్యాల వివరాలు తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో హైదరాబాద్ జిల్లా మేనేజర్ కె. సాయి అరుణ్, అదనపు జిల్లా మేనేజర్ దీప్తి, గోదాం ఇన్‌చార్జీలు గోపాలకృష్ణ, కిరణ్ పాల్గొన్నారు.