- 9 నెలలకే ప్రజలకు అర్ధమైంది.
- ప్రభుత్వం పిచ్చి పనులు చేస్తే చూస్తూ ఊరుకోం.
- రాబోయే కాలంలో బీజేపీదే అధికారం.
- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రజల మీద ప్రేమ లేదని 9 నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ప్రజలకు అర్దమైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.రాష్ట్రంలో నెలకు రూ.7 వేల కోట్లు అప్పు కడుతున్నామని, సంవత్సరానికి రూ.84 వేల కోట్లు అప్పు కడుతున్నామని కాంగ్రెస్ పాలకులే చెబుతున్నారని, ఇక ప్రభుత్వాని నడపలేమని చేతులెత్తేసే పరిస్థితికి దిగజారారని ఆయన విమర్శించారు.జీతాలు ఇస్తారో ఇవ్వరనే అభద్రతా భావంలో ఉద్యోగులు, అలాగే సంక్షేమ పథకాలు అమలవుతాయో లేదో అని ప్రజలు ఉన్నారని ఆయన తెలిపారు.కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ డబ్బులు సంవత్సరమైనా లబ్దిదారులకు అందలేదన్నారు. సర్పంచులకు, కాంట్రాక్టర్లకు డబ్బులను ప్రభుత్వం చెల్లించడం లేదని అన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో భారతీయ మజ్దూర్ సంఘ్ 70వ వార్షికోత్సవం సందర్భంగా భారత్ ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ ఏర్పాటు చేసిన డ్రైవర్ల సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు.డ్రైవర్స్ ఫోర్స్ చాల పెద్దదని కానీ వీరి గురించి ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. డ్రైవర్లకు బీజేపీ అండగా ఉంటుందని ఎంపీ ఈటల హామీ ఇచ్చారు. డ్రైవర్లకు కనీస వేతన చట్టం అమలు, పీఎఫ్, హెల్త్ కార్డులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.డ్రైవర్లు చనిపోతే కనీసం రూ.10 లక్షల నష్టపరిహారం బాధిత కుటుంబానికి అందేలా చూడాలన్నారు.ప్రభుత్వం పిచ్చి పనులు చేస్తుంటే ఊరుకోమని అన్నారు.హెచ్ సీయూ భూములు అమ్ముకోవాలని చూసినప్పుడు ఒక్క ఎకరం కూడా అమ్మనివ్వకుండా బీజేపీ చేసి పోరాటాన్ని ప్రజలంతా గమనించారన్నారు.బీజేపీ 8 మంది ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, ముగ్గులు ఎమ్మెల్సీలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నామని ఈటల తెలిపారు.ప్రధాని నరేంద్ర మోడీ రూ.4 లక్షల కోట్ల బడ్జెట్‌లో పెట్టి నిరుద్యోగ సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.ప్రధాని విశ్వకర్మ యోజన, ముద్ర రుణాలను ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇస్తామని తెలిపారు.యువశక్తిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలన్నదే ప్రధాని మోడీ ఆకాంక్ష అని ఆయన చెప్పారు.ప్రధాని మోడీ చొరవతో ప్రపంచంలో భారతదేశ గౌరవం పెరిగిందన్నారు.విదేశాల్లో ఉన్న మనవారు మేం భారతీయులమని గర్వంగా చెప్పుకుంటున్నారని అన్నారు.
