Take a fresh look at your lifestyle.

ఈ నెల 19 తర్వాత రాష్ట్రంలో భారీ వర్షాలు అప్పటి వరకు తప్పని భానుడి భగభగలు రాష్ట్ర వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం అనూహ్యంగా మారనుంది. ఈ నెల మధ్య వరకు భానుడి భగభగలు కొనసాగనుండగా.. ఆ తర్వాత అకాల వర్షాలు పలకరించనున్నాయని వాతావరణ శాఖ, వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ముదిరిపోతున్నాయి. ఈ నెల 18వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు చేరవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 37 డిగ్రీల మధ్య నమోదు కానున్నాయి. మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ప్రజలు అనవసరంగా బయటకు రాకూడదని.. ముఖ్యంగా వృద్ధులు , చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తూ ఈనెల 19వ తేదీ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ తెలిపింది. ఈసారి కురిసే వర్షాలు గత ఫిబ్రవరిలో వచ్చిన వానల కంటే తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ పంట కోత దశలో ఉన్న రైతులు ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కాగా ఈ ఏడాది ఎల్-నినో ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉష్ణోగ్రతల పెరుగుదల దృష్ట్యా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేశారు. ఎండలతో డీహైడ్రేషన్ బారిన పడకుండా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.