చేతకాకపోతే ఆ బాధ్యత మాకు అప్పగించాలి
మీ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇళ్లయినా నిర్మించినట్టు నిరూపించాలి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రెండున్నరేండ్లలో కాంగ్రెస్ పాలనలో హైదరాబాదులో ఒక్క ఇల్లైనా కట్టించినట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. మూసీ సుందరీకరణ మీకు చేతకాకపోతే తమకు అప్పజెప్పాలన్నారు. మూసీని ఎలా సుందరీకరించాలో చేసి చూపిస్తామని అన్నారు. ప్రజల ఇండ్లు కూల్చకుండా ఎలాంటి విధ్వంసం చేయకుండా మూసి సుందరీకరణతో అభివృద్ధి చేసి చూపించాలని కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. గురువారం నాగోల్‌లోని ఎస్టిపి ప్లాంట్‌ను సందర్శించిన ఆయన మూసి పరివాహక ప్రాంత నివాసులకు దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసి తీరంవెంట ఐదున్నర కిలోమీటర్లు సుందరీకరణ చేసినట్లు తెలిపారు. నాగోల్‌లో ఏర్పాటు చేసిన ఎస్టీపీ ప్లాంటు 320 ఎంఎల్డీతో భారతదేశంలోనే అతిపెద్ద ప్లాంట్‌ను ఏర్పాటు చేసి మూసీనీటిని శుద్ధిచేసినట్లు తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు 2 వేల మిలియన్ మురికి నీరు మూసీనదిలో ప్రవహిస్తుందని తెలిపారు. మూసీనదిని జీవనదిగా మార్చడానికి కేసీఆర్ పునాది వేసినట్లు పేర్కొన్నారు. తాము రూ. 3866 కోట్లతో 32 సేవరేజి ప్లాంట్లకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 2023 డిసెంబర్ ఎన్నికల నాటికి 85శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ప్రతి మురికి నీటిచుక్క గ్రావిటీ ద్వారా వచ్చి శుద్ధిచేయబడాలని చేశామని వివరించారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా రూ.1100 కోట్లతో గోదావరి నీటిని గండిపేట చెరువులోకి తీసుకొచ్చి ఆ నీటిని మూసిలోకి వదిలితే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదని వివరించారు. మూసీనదిపై 15 బ్రిడ్జిలను నిర్మించాలని అప్పట్లో నిధులు మంజూరు చేశామని చెప్పారు. తద్వారా చెక్ డ్యాములు పెట్టి నీటిని శుద్ధిచేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకు శుద్ధి జరిగిన నీరు వెళ్లడం ద్వారా రైతులకు న్యాయం జరిగేదని ఆదిశగా తాము రూపకల్పన చేసినట్లు వివరించారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా ఐదు కిలోమీటర్లు మూసి సుందరీకరణ చేసి నాగోల్‌లో 10 ఎకరాల విశాలమైన స్థలంలో రూ. 30 కోట్లతో శిల్పారామం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాము మూసి సుందరీకరణకు రూ.16 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన ప్రారంభంలో లక్షయాభై వేల కోట్లతో సుందరీకరణ చేస్తామని అనడం ప్రజాధనాన్ని లూటీ చేయడమేనని పేర్కొన్నారు. ఎలాంటి డిపిఆర్ రిపోర్టు లేకుండా ప్రణాళిక లేకుండా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసాలకు రెడ్ మార్కులు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ సర్కారు నడుస్తుందని మాట్లాడిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. మరి ఖమ్మంలో పేద ప్రజల ఇండ్లు కూల్చడం ద్వారా కాంగ్రెస్ బుల్డోజర్ సర్కారు కాదా అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్‌లో 150 మంది వికలాంగులను మెడలుపట్టి బయట గెంటేసి ఇండ్లు కూలగొట్టడం రాహుల్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు. హైడ్రా పేరిట చేసే అరాచకాలకు హైదరాబాదులో అంతేలేదని విమర్శించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు రెడ్డికుంటలో లేదా అది వాస్తవం కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి దుర్గం చెరువులోని ఎఫ్ టి ఎల్ లో ఇల్లు కట్టుకున్నాడని, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బఫర్ జోన్‌లో ఇండ్లు కట్టుకుంటే అవి కనిపించడం లేదా అని నిలదీశారు. ముఖ్యమంత్రి పేద ప్రజల జోలికి పోతున్నావు.. వారు ఊరుకోరని హెచ్చరించారు. కుర్చీ మడతపెట్టి కొట్టే సమయం వస్తుందని అప్రతమతం చేశారు. మూసీ పేరిట లూటీ చేస్తామంటే తాము ఊరుకునేది లేదని అన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు పి. సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, వివేకానంద, కాలేరు వెంకటేష్, ముప్పిడి గోపాల్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, రాగిడి లక్ష్మారెడ్డి, క్యామ మల్లేష్, లింగాల రాహుల్ గౌడ్, అనంతుల రాజిరెడ్డి, చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, జీవి సాగర్ రెడ్డి, పోచంపల్లి రాజేందర్ రెడ్డి, పల్ల శిల్పారెడ్డి, మాజీ కార్పొరేటర్లు డివిజన్ల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.