ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి సందర్భంగా స్థానిక గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పాత్ర అత్యంత విశిష్టమైందన్నారు. నాటి దొరల అరాచకాలు, మొగలాయుల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొని సామాన్య ప్రజల హక్కులను కాపాడిన గొప్ప యోధుడు అని కొనియాడారు. పాపన్న గౌడ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు.తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుల ఆశయాలను కొనసాగించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమని పేర్కొంటూ రాష్ట్రంలో అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే మూడేళ్లలో ఈ పాఠశాలలను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్య అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, నాయకులు మైత్రి యాదయ్య, ఆంజనేయులు, గ్ అంజి, బీసీ సంక్షేమ అధికారి ఇందిరతో పాటు మహిళలు పాల్గొన్నారు.
……………………………..
ప్రజా సమస్యల పరిష్కారం :
……………………………..
పాత పాలమూరు, 10 వ డివిజన్ లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతోందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల కుటుంబ బీమా పథకాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ
రాష్ట్రమే అని ఆయన తెలిపారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తూ, కుటుంబం లోని ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం దశలవారీగా పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
………………………………..
నైపుణ్య శిక్షణ కేంద్రం సందర్శన :
…………………………..
మహబూబ్ నగర్ మెట్టు గడ్డలో ఉన్న ఎటిసి సెంటర్‌ను యెన్నం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎటిసి సెంటర్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఆయన మాట్లాడి శిక్షణ విధానం, వసతులు తదితర అంశాలపై వివరంగా తెలుసుకున్నారు. ప్రస్తుత కాలంలో నైపుణ్యాలు కలిగిన వారికి ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకొని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఎటిసి సెంటర్ ప్రిన్సిపాల్ అభ్యర్థన మేరకు వెంటనే ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, శ్రీరామ జయరామ మోటార్స్ ఎండీ బెక్కెరి రామిరెడ్డి, మారుతి కార్స్ సిఇఓ విక్రం యాదవ్, ఎటిసి సెంటర్ ప్రిన్సిపాల్ గోపాల్ నాయక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.