ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో మహిళలు భారీగా ప్రయోజనం పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకం అమలు అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి సుమారు రూ.10 వేల కోట్ల రూపాయలను ఆదా చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పించడం గొప్ప నిర్ణయమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించిందని, ప్రస్తుతం ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఆదా చేసిన డబ్బును ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించడం వల్ల సంస్థకు నూతన జీవం లభించిందని వివరించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు రూ.8.98 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని వెల్లడించారు. అలాగే నారాయణపేట జిల్లా మహిళలు రోజుకు రూ.41.79 లక్షల వరకు ఆదా చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం సమయానికి నిధులు చెల్లించడం వల్ల ఆర్టీసీని బలపరచగలిగామని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు ఉచిత బస్సు ప్రయాణంపై అవహేళనగా మాట్లాడటం సరికాదని ఎమ్మెల్యే ఆక్షేపించారు. ఉచిత ప్రయాణం వల్ల మహిళలు గణనీయంగా ఆర్థికంగా లాభపడుతున్నారని తెలిపారు. “నిజం గడప దాటకముందే అబద్ధం ఊరంతా తిరుగుతుంది” అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, ఆర్టీఏ సభ్యుడు గోపాల్ రెడ్డి, డీటీఓ, డిపో మేనేజర్, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.