మంచినీటి నల్లాలకు, విద్యుత్ మోటర్లు బిగించి నీటి చౌర్యం చెస్తే చర్యలు: జలమండలి మేనేజర్ సాయి కిరణ్ గౌడ్
- అక్రమ నీటి కనెక్షన్ల తొలగింపు పై దృష్టి.
- నల్లాలకు మీటర్లను బిగించుకోవాలని వినతి.
కుషాయిగూడ (నాగారం) , ముద్ర విలేఖరి: మంచినీటి నల్లాలకు విద్యుత్ మోటార్లు బిగించి నీటి చౌర్యం చేసే ఇంటి యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాగారం సెక్షన్ జలమండలి మేనేజర్ సాయి కిరణ్ గౌడ్ తెలిపారు. బుధవారం నాగారంలోని జలమండలి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సెక్షన్ పరిధిలో కొంతమంది ఇంటి యజమానులు విద్యుత్ మోటర్లు బిగించి నీటిని అక్రమంగా తోడేసుకుంటున్నారని తెలిపారు. దీంతో దిగువ ప్రాంతంలో ఉన్న ఇంటి యజమానులకు నీటి సామర్థ్యం తగ్గి సరిపడా నీళ్లు రావటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అందుకే ప్రాంతాలవారీగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నీటి చౌర్యం చేస్తున్న వారిని గుర్తించి విద్యుత్ మోటార్లను స్వాధీనం చేసుకుంటామన్నారు. అలాగే ఆ ఇంటి యజమానులకు జరిమానా విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ నీటి కనెక్షన్ లపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని తొలగిస్తామని తెలిపారు. ఇక ఇప్పటికే మంచినీటి కనెక్షన్లు పొందిన వారు విధిగా మీటర్లను అమర్చుకోవాలని తెలిపారు. ఇలా మీటర్లు అమర్చుకోవటం వలన నెలవారిగా ఇంటి యజమానులు ఎంత నీటిని వాడుతున్నారో రీడింగ్ నమోదు అవుతుందని తెలిపారు. మెరుగైన నీటి సరఫరాకు ఇంటి యజమానులు జల మండలి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.ఇక జలమండలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.