Take a fresh look at your lifestyle.

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం కూల్చివేత

  • ఐదు అంతస్థుల భారీ భవనం నేల మట్టం
  • అయప్ప సొసైటీలో దాదాపు అన్ని కట్టడాలు అక్రమమే – హైడ్రా కమిషనర్ రంగనాథ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ గ్రామంలోని అయ్య‌ప్ప‌ సొసైటీ స‌ర్వే నంబ‌రు 11/5 లో ప్లాట్ నంబ‌రు 5/13 పేరిట 684 గ‌జాల‌లో అక్ర‌మంగా నిర్మించిన‌ భ‌వ‌నాన్ని హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేశారు. కూల్చివేత సందర్భంగా స్థానిక పోలీసులతో పాటు హైడ్రాకు చెందిన డీఆర్ఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. జీహెచ్ ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను ప‌ట్టించుకోకుండా సెల్లార్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు 5 అంత‌స్తుల (సెల్లార్ నుంచి 7 అంత‌స్తులు) భ‌వ‌నాన్ని నిర్మించ‌డంపై స్థానికుల ఫిర్యాదు మేర‌కు హైడ్రా ఈ కూల్చివేత‌లు చేప‌ట్టింది. అయితే ఈ భవన అక్రమ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవల్సిందిగా హైడ్రా నివేదిక తయారు చేస్తోంది.

అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్ని కట్టటాలు అక్రమమే – రంగనాథ్

అయప్ప సొసైటీలో దాదాపు అన్ని కట్టడాలు అక్రమమే అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కట్టడాలను కూల్చివేస్తున్నామని ఆయన తెలిపారు. అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాల్లో అనేక హాస్టళ్ళు వస్తున్నాయని చెప్పారు. ఆయా భవనాలకు ఫైర్ సేఫ్టీ , నిర్మాణ అనుమతులు లేవన్నారు. అక్ర‌మ నిర్మాణాల‌తో మురుగు నీటి వ్య‌వ‌స్థ కూడా బాగా దెబ్బ‌తిందన్నారు. దీంతో ఆ ప‌రిస‌రాలు మురుగు మ‌యంగా మారుతున్నాయని తెలిపారు. ర‌హ‌దారుల్లో మురుగు నీరు పారుతున్న దృశ్యాలు క‌నిపించాయని, ఇది మౌలిక సదుపాయాలపై (డ్రెయినేజ్ పైపులపై) అధిక భారం వల్ల జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అయ్య‌ప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్‌తో సమీక్ష నిర్వహించి సమన్వయంతో చర్యలు తీసుకుంటామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.