- భూముల విక్రయాన్ని నిరసిస్తూ విద్యార్ధుల ఆందోళన.
- భారీగా మోహరించిన పోలీసులు.
- విద్యార్ధి సంఘాలు, టీచింగ్, నాన్ టీచింగ్, వర్కర్లు ఏకమై పోరాటం.
- ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం.
- విద్యార్థుల అరెస్టు ను ఖండించిన ఎస్ఎఫ్ఐ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీ యూ)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనివర్సిటీకి చెందిన భూములను వేలం వేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి నుంచి తమ ఆందోళనను విద్యార్ధులు ఉధృతం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అయితే ఆదివారం నాడు యూనివర్సిటీ పరిధిలోని పచ్చనిచెట్లను నకిరివేయడానికి ప్రభుత్వం పూనుకుంది. యూనివర్సిటీ పక్కన ఉన్న స్థలంలో చెట్లను నరికివేతను విద్యార్ధులు అడ్డుకున్నారు. విద్యార్ధులను చెదరగొట్టేందుకు వారిపై పోలీసులు లాఠీచార్జ్ జరపడంతో మళ్ళి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్ధులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకుని, యూనివర్సిటీ మెయిన్ గేటుకు పోలీసులు తాళం వేశారు. వర్సిటీ ప్రాంగణంలో జేసీబీలతో చెట్లను కూల్చివేసి నేలను చదును చేస్తున్నారు. హెచ్ సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తక్షణమే జోక్యం చేసుకుని, హెచ్ సీయూ భూములను విక్రయించకుండా చొరవ చూపాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. హెచ్ సీయూ భూములను ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపించి ప్రభుత్వాలు వెనక్కి తీసుకుంటున్నాయని విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి. యూనివర్సిటీ ఏర్పడిన 50 ఏళ్ళ కాలంలో 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని, మొదట 2300 ఎకరాల్లో హెచ్ సీయూను ఏర్పాటు చేయగా, ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాల భూమి మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 400 ఎకరాలను కనుక ప్రభుత్వం విక్రయిస్తే, ఇక హెచ్ సీ యూకు మిగిలేది 1400 ఎకరాలు మాత్రమేనని వారు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, విద్యార్థుల అరెస్టును ఎస్ఐఎఫ్ తీవ్రంగా ఖండించింది. ఆందోళనను అణచివేసే క్రమంలో అరెస్టులు కొనసాగుతున్నాయని, విద్యార్థులను వెంటనే విడిచిపెట్టాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.
- విద్యార్ది సంఘాలు, టీచింగ్, నాన్ టీచింగ్, వర్కర్లు ఏకమై పోరాటం
టీజీఐఐసీ ద్వారా హెచ్ సీయూకు చెందిన 400 ఎకరాలను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్ది సంఘాలు, టీచింగ్, నాన్ టీచింగ్, వర్కర్లు ఏకమై పోరాటానికి దిగారు. వీరంతా జేఏసీగా ఏర్పాడి ఆందోళనను ఉధృతం చేశారు. ఇదిలావుండగా తాము విక్రయించదల్చిన 400 ఎకరాల భూమి హెచ్ సీయూది కాదని, అందుకే కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు ఆ భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. చూట్టూ ఐటీ కారిడార్ ఉండటంతో ఈ భూముల విక్రయం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ 400 ఎకరాల భూమిని విక్రయిస్తే రూ.10 వేల కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసిందని విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి.
- ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం
హెచ్ సీయూ భూముల విక్రయాల నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలంటూ ఆందోళన చేపట్టిన విద్యార్ధులపై పోలీసుల లాఠీఛార్జ్ చేయడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించి, రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ రూమ్‌లోకి వెళ్ళి విద్యార్ధులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని ఆయన ఆరోపించారు. ప్రతిష్టాత్మకమైన హెచ్ సీయూను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ భూములను తెగనమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా? ఆయన ప్రశ్నించారు. భావితరాలకు గజం జాగా కూడా మిగల్చరా అని నిలదీశారు. హెచ్ సీయూ భూముల వేలం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.