- ఇంటర్నల్ సర్వేలో వెలుగులోకి షాకింగ్ నిజాలు.
- మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ ల పనితీరే మెరుగ్గని వెల్లడి.
- ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సింగిల్ డిజిట్‌కు పరిమితం.
- త్వరలోనే జిల్లా ఇన్ ఛార్జీ మంత్రుల మార్పు..?
- ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడంలో విఫలంపై ఏఐసీసీ అసంతృప్తి.
- మంత్రివర్గ విస్తరణ తర్వాత హస్తంలో కీలక పరిణామాలు.
- పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి చేతికి పదేళ్లు పార్టీలో ఉన్న నేతల జాబితా.
- మీనాక్షితో నేరుగా అగ్రనేతల చర్చలు.
- అధిష్టానం సూచనతో ఇప్పటికే మూడు కేటగిరీలుగా పార్టీ నేతలు.
- లోక్ సభ సెగ్మెంట్ల వారీగా వేర్వేరు సభలు పూర్తి.
- ఏఐసీసీ ఆదేశాలతో కీలక నేతలపై చర్యలకు నటరాజన్ సన్నద్ధం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రక్షాళనకు ఏఐసీసీ సిద్ధమైంది. దారి తప్పిన పార్టీని గాడిలోకి తీసుకువచ్చేందుకు కఠిన నిర్ణయాలకు ఉపక్రమించింది.పదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారశైలిని కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పార్టీని గాడిలోకి తీసుకోవాలని భావిస్తున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా..సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్నా..ప్రభుత్వంపై క్షేత్రప్ధాయిలో ఆశించిన స్ధాయిలో ప్రజామోదం లేకపోవడంతో అధిష్టానం గుర్రుగా ఉంది.ఈ క్రమంలో ఇటీవల ఓ థర్డ్ పార్టీతో సర్వే నిర్వహించిన ఏఐసీసీ షాకింగ్ ఫలితాలు చవి చూసింది. ప్రస్తుతం 12 మందితో కూడిన మంత్రివర్గంలో శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ మినహా మిగతా మంత్రుల పనితీరుపై స్ధానిక ప్రజలు, పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొన్నట్లు గుర్తించింది.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పార్టీ సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని సర్వేలో వెల్లడైంది.దీంతో ప్రస్తుతమున్న ఉమ్మడి జిల్లాల ఇన్ ఛార్జీ మంత్రులను మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఉన్న ఇన్ ఛార్జీ మంత్రుల్లో చాలా మంది ఆయా ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలను సమన్వయం చేసుకోలేకపోతున్నట్లు అధిష్టానం గుర్తించింది. అంతేకాకుండా వీరిలో ఇద్దరు ఆయా జిల్లాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్లు ఏఐసీసీకి ఫిర్యాదులు అందాయి.పరిస్థితులు ఇలానే ఉంటే పార్టీ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భావించిన అధిష్టానం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇన్ ఛార్జీ మంత్రులను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.మరోవైపు ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడంలోనూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారనే అసంతృప్తితో ఏఐసీసీ ఉంది. ఈ నేపథ్యంలో ఇది వరకే వారిని హెచ్చరించిన అధిష్టానం… పలువురు మంత్రుల శాఖలను మార్చాలని, ఒకరిద్దని కేబినెట్ నుంచి ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకున్నది. మంత్రివర్గ విస్తరణతో పాటు పనితీరు ఆధారంగా మంత్రుల పోర్ట్ ఫోలియోలు కూడా మారుస్తారనే ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం ఉన్న శాఖలతో పాటు సీఎం దగ్గరున్న శాఖలను కేటాయించే విషయంపైనా అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన దగ్గరున్న శాఖలలో మార్పు చేయాలని కోరారు. తన ఇరిగేషన్ శాఖను మార్చి రెవెన్యూశాఖ ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు. అయితే రెవెన్యూశాఖ మంత్రిగా ఉన్న పొంగులేటికి..సీఎం దగ్గరున్న అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ ఇవ్వనున్నట్లు తెలిసింది. అలాగే రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఇరిగేషన్ శాఖ ఇస్తారనేచర్చ జరుగుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం ఏఐసీసీ ఆదేశాలు, సూచనలతో సంచలన నిర్ణయాలు తీసుకుని ముందుకువెళ్తున్నారు.నామినేటెడ్ పదవులపై కసరత్తు ప్రారంభించిన మీనాక్షి ఇప్పటికే పార్టీలో నేతలను మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్న వాళ్లు ఒక గ్రూపు, ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండో గ్రూపు, అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారని మూడో గ్రూప్‌గా విభజించారు.పార్టీ పదవులు..నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.పదేళ్లు పార్టీలో ఉన్నవారి లిస్ట్ కోరిన ఇన్‌చార్జ్ మీనాక్షి.మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది.అలాగే అధిష్టానం ఆదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ కాంగ్రెస్ పనితీరుపై ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహించారు.లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో విడివిడిగా సమావేశమైన ఆమె నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో పార్టీలో ఎవరి పనితీరు ఎంటో తనకు తెలుసని ఎవరు పనిచేస్తున్నారో,ఎవరు నటిస్తున్నారో తెలుసని షాక్ చిచారు.పార్టీ కోసం సమయం కేటాయించాలన్న ఆమె అంతర్గత విషయాలు బయట చర్చించొద్దంటూ ఇది వరకే హెచ్చరించారు.పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటున్నానని చెప్పిన మీనాక్షి..నియోజకవర్గ ఇంఛార్జ్‌లు బాధ్యతతో పనిచేయాలన్నారు. ఇంఛార్జ్ వల్లే సమస్యలు వస్తే..పదవి నుంచి తొలగిస్తామంటూ ఆమె ఖరాఖండిగా చెప్పేశారు.