Take a fresh look at your lifestyle.

ఐటీ కారిడార్లో రోడ్ల విస్తరణకు కసరత్తు: అధికారుల సంయుక్త పరిశీలన

 

ముద్ర, శేరిలింగంపల్లి :

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో రోడ్డు విస్తరణ పనులపై దృష్టి సారించారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీలక మార్గాల్లో నెలకొన్న బాటిల్‌నెక్‌లను తొలగించి, రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన ఐఏఎస్., జలమండలి అధికారి అశోక్ రెడ్డి ఐఏఎస్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ భోర్కడే హేమంత్ సహదేవరావు ఐఏఎస్, ట్రాఫిక్-1 డీసీపీ జె. రంజన్ రతన్ కుమార్‌తో పాటు టీజీఐఐసీ జోనల్ మేనేజర్ ఎం. కవిత వివిధ శాఖల ఉన్నతాధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ముఖ్యంగా మాదాపూర్‌ లెమన్ ట్రీ హోటల్ నుంచి సైబర్ టవర్స్ వరకు, అక్కడి నుంచి మెడికోవర్ ఆస్పత్రి వరకు ఉన్న రహదారులను అధికారులు పరిశీలించారు. మాదాపూర్‌ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువు, నెక్టర్ గార్డెన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సాఫీగా సాగకుండా అడ్డుపడుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రహదారి వెడల్పునకు ఆటంకంగా ఉన్న ఆక్రమణలు, విద్యుత్ స్తంభాలు, నీటి పైప్‌లైన్ల వంటి యుటిలిటీల మార్పుపై ఆయా శాఖల మధ్య సమన్వయం ఉండాలని అధికారులు ఆదేశించారు. పనులు జరిగే సమయంలో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విస్తరణ పనుల ద్వారా ఐటీ కారిడార్‌లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా, ప్రయాణికుల భద్రత కూడా పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.