– మేయర్ పోటీలో ప్రధానంగా ఉన్న అభ్యర్థుల ఓటమి
– ప్రస్తుతం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం
– మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ భార్య ప్రసన్న మేయర్ పీఠం పై గురి
– మేయర్ పదవి ఆశిస్తున్న కార్పొరేటర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రమాదేవి
– ఎమ్మెల్యే యెన్నం కు తలనొప్పిగా మారిన మేయర్ ఎన్నిక
– మేయర్ ఎంపికను అధిష్టానం పైకి నెట్టి చక్రం తిప్పనున్న ఎమ్మెల్యే యెన్నం, డీసీసీ అధ్యక్షులు సంజీవ్
– డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకోవాలని సురేందర్ రెడ్డి ప్రయత్నం
– ఎం ఐ ఎం , స్వతంత్రుల మద్దతుతో గట్టెక్కనున్న కాంగ్రెస్… వీరిలో డిప్యూటీ మేయర్ అడిగే అవకాశం
– ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులకు తలనొప్పిగా మారిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక
………………………………………
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………
అనుకున్నదొక్కటి… అయినది ఒక్కటి.. బోల్తాకొట్టారులే కాంగ్రెస్ అభ్యర్థులు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థులు మేయర్ పదవి దక్కించుకునేందుకు ఎన్నికలకు ముందే పావులు కదిపారు. ఈ ఇద్దరిలో ఒకరికి తప్పకుండా మేయర్ కుర్చీలో కూర్చునే వారు.ఇద్దరి ఎవరు గెలిసివచ్చినా మేయర్ పదవి కట్టబెడతామని పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. కానీ ఫలితం ముందర బొక్కబోర్లా పడ్డారు ఇద్దరు నేతలు. ఈ కార్పొరేషన్ బీసీ మహిళ కు రిజర్వేషన్ కావడం తో ముఖ్యంగా నాలుగు అభ్యర్థులు మేయర్ పదవి ఆశించారు. అందులో ఇద్దరి లో ఒకరికి మాత్రం మేయర్ పదవి దక్కుతుందనే ఆశలో ఉన్నారు. 37 డివిజన్ నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత ఎన్ పి వెంకటేష్ తన కూతురు నేహాశ్రీ ని బరిలో ఉంచారు. ఇక్కడ ఈమె గెలుపొందితే మేయర్ పీఠం దక్కే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ఫలితం ఆమెకు బెడిసికొట్టింది. అనూయ్యoగా బీజేపీ అభ్యర్థి కి విజయం వరించింది. 41 డివిజన్ అభ్యర్థి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ సతీమణి స్వప్న పోటీలో ఉన్నారు. తన భార్య కు మేయర్ పదవి ఇస్తే ముడా( మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ) చైర్మన్ పదవి వదులుకుంటానని ప్రకటించారు. ఈయన భార్య కే మేయర్ పదవి కట్టబెట్టాలని ఎమ్మెల్యే, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు అనుకున్నారు.కానీ ఇక్కడ ఫలితం తారుమారైంది.కాంగ్రెస్ గెలుస్తామనుకున్న ఈ స్థానం లో గులాబీ పార్టీ గెలుపొందింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ ఆశలు గళ్లంతయ్యాయి.ఈ ఓటమి చెందిన నేతలు సొంత పార్టీ నేతల పైనే ఆరోపణలు చేస్తున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు తమకు మేయర్ పదవి వస్తుందనే ఉదేశ్యం తో తమ ఓటమికి పనిచేశారని, ఈ విషయం పై డీసీసీ కి, ఎమ్మెల్యే కు, పార్టీ అధిష్టానం కు ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. ప్రస్తుతం మేయర్ పదవి దక్కదనే అక్కసు తోనే ఇతర డివిజన్లలో పోటీ చేసిన కొందరు నాయకులు తమ ఓటమికి ప్రయత్నం చేశారని వారు ఆరోపిస్తున్నారు.
…………………………………..
మేయర్ కోసం ఇద్దరి పట్టు :
……………………………………..
మేయర్ పదవి రేసు లో ఉన్న ఇద్దరి ఓటమి తో గెలిచిన మరో ఇద్దరు తెర పైకి వచ్చారు.మొదటి నుంచి మేయర్ పదవి ఆశిస్తున్నా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తన భార్య ప్రసన్న లక్ష్మికి మేయర్ పదవి ఇవ్వాలని ఎన్నికల ముందునుంచే తన వాయిస్ గట్టిగానే వినిపిస్తున్నారు. ఎందుకంటే గతం లో ఆయన బీ ఆర్ ఎస్ నుంచి మున్సిపల్ చైర్మన్ దక్కించుకుని అప్పటి బీ ఆర్ ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో విబేదాలు వచ్చి కొంతకాలానికి ఆ పార్టీ ని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన తో పాటు పలువురు కౌన్సిలర్ల ను తన వెంట తెచ్చుకున్నారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం చేసి ఆయన విజయం లో పాలుపంచుకున్నారు. అందుకే ప్రస్తుతం 49 డివిజన్ నుంచి ఎన్నికైన తన భార్య ప్రసన్నకు మేయర్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే యెన్నం పై వత్తిడి తెస్తున్నారనే సమాచారం ఉంది.మరో డివిజన్ అభ్యర్థి కూడా మేయర్ పదవి తనకే ఇవ్వాలని ఎమ్మెల్యే, డీసీసీ పై ఒత్తిడి పెంచుతోంది. 58 డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అభ్యర్థి గా ఏకగ్రీవం అయిన చలువగాలి రమాదేవి కూడా మేయర్ పదవి కావాలని పట్టుబడుతున్నారు. ఈమెకు కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానం నుంచి జిల్లా డీసీసీ, ఎమ్మెల్యే కు ఒత్తిడి తెస్తున్నదని సమాచారం. ఈ ఇద్దరి వ్యవహారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ కు తలనొప్పిగా మారింది. మేయర్ ఎంపికను రాష్ట్ర అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి బంతి ని వారి కోర్టు లో ఉంచి చక్రం తిప్పలని ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు చూస్తున్నారని తెలిసింది. ఈ ఇద్దరి లో ఒకరి ఎంపిక కత్తి మీద సాములాంటిదే.
…………………………………..
డిప్యూటీ ఎవరికో…?
…………………………………….
మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్ల కు గాను 29 డివిజన్ల లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇక్కడ మేయర్ పీఠం దక్కలంటే మేజిక్ ఫిగర్ 31 డివిజన్ల లో గెలుపొందాలి. కానీ కాంగ్రెస్ కు 29,బీ ఆర్ ఎస్ కు 15, బీజేపీ 8 ఎం ఐ ఎం కు 3, స్వతంత్రులు 5 స్థానాల్లో విజయం సాధించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కాలంటే ఎం ఐ ఎం అభ్యర్థులు ముగ్గురిని, లేదా స్వతంత్రులను ఐదుగురి ని కలుపుకొనాలి. వీరు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తే డిప్యూటీ మేయర్ పదవి అడిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే ఈ పదవి పై 11 డివిజన్ నుంచి ఎన్నికైన మారెపల్లి సురేందర్ రెడ్డి పట్టుపడుతున్నారు. ఈయన ఎమ్మెల్యే కు అత్యంత సన్నిహితుడు కావడం తో ఆయనకే డిప్యూటీ మేయర్ దక్కే అవకాశం ఎక్కువగా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక, అటు కాంగ్రెస్ అధిష్టానం కు, ఇటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ కు తలనొప్పిగా మారింది. ఈ టెన్షన్ కు మరో రెండు రోజుల్లో తెర పడనుంది.