Take a fresh look at your lifestyle.

ప్రజావాణి సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలి – జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

 

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మాధురి,పాండు,సబ్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల పరిష్కారంపై నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని, అందువల్ల ప్రతి అర్జీపై సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.ఈరోజున నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 67 అర్జీలు అందినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు,మున్సిపల్ కమిషనర్లు,ఇతర సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

వేసవి తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు.


సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో ఫిర్యాదుల స్వీకరణ అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ,ఈసారి సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ముందుగానే చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రతిరోజూ హీట్ వేవ్ ఉష్ణోగ్రతల నివేదికను జిల్లా అధికారుల గ్రూపులో షేర్ చేయాలని సీపీఓను ఆదేశించారు.కార్మికులు, సాధారణ ప్రజలు ఎండల వల్ల ఇబ్బందులు పడకుండా లేబర్ అడ్డాలు,పని ప్రదేశాల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
జిల్లాలోని అన్ని బస్తీ దవాఖానాలు,పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను సమృద్ధిగా నిల్వ ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, గురుకులాలు,వసతి గృహాలలో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో 100–200 ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండేలా చర్యలు చూసుకోవాలని పంచాయతీ సెక్రటరీలకు సూచనలు ఇవ్వాలని డీపీఓకు ఆదేశించారు.వడదెబ్బ నివారణపై “ఏం చేయాలి – ఏం చేయకూడదు” అనే అంశాలపై విస్తృత ప్రచారం చేయాలని,అన్ని సబ్ సెంటర్ల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు సలహాలు అందించాలని సూచించారు.ప్రధానంగా వ్యవసాయ కూలీలు,ఉపాధి హామీ కార్మికులు,పరిశ్రమలలో పని చేసే వారు,భవన నిర్మాణ కార్మికులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున,వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.పని ప్రదేశాలు,బస్టాండ్లు,పరిశ్రమల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తమ పరిధిలో అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా వడదెబ్బ వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య కోరారు.ఈసమావేశంలో అదనపు కలెక్టర్లు మాధురి, పాండు,సబ్ కలెక్టర్ ఉమా హారతి,జిల్లా అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు,మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.