ముద్ర ప్రతినిధి సంగారెడ్డి:
సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కృషి చేయాలని, దీనికి సంబంధించిన పథకాలను మరిన్ని అమలు చేయాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టియు డబ్ల్యూజె-ఐజేయు) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి కోరారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో మంగళవారం నాడు వార్త ల్యాప్ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ ఇలాంటి వర్క్ షాపులు జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన అనేక విషయాలు నేర్చుకోవచ్చునని అన్నారు. మారుతున్న కాలానికి తగిన విధంగా సాంకేతిక నైపుణ్యాన్ని కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత కాలంలో జర్నలిజంలో అనేక మార్పులు వస్తున్నాయని, వాటికి తగిన విధంగా జర్నలిస్టులము కూడా మారుతున్నామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు వర్క్ షాపుల ద్వారా ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో వారి సంక్షేమం పట్ల కూడా ప్రభుత్వాలు శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. ముఖ్యంగా జర్నలిస్టుల ఉద్యోగ భద్రత పై దృష్టి సారించాలని కోరారు. అంతేకాకుండా జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భీమా విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వార్తలను కవర్ చేస్తున్న సందర్భంలో ప్రమాదాలను లెక్కచేయకుండా జర్నలిస్టులు పరుగెడుతున్నారని చెప్పారు. చివరకు తమ కుటుంబాన్ని, ఎంతో విలువైన జీవితాన్ని కూడా లెక్కచేయకుండా వృత్తినిబద్ధతకు కట్టుబడి ఉంటున్నారని అన్నారు. ఈ క్రమంలోనే అనేకమంది తీవ్ర గాయాల పాలవుతున్నారని, దుర్మరణం చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సందర్భాలలో జర్నలిస్టుల కుటుంబాలకు తీరని నష్టం జరుగుతున్నదని పేర్కొన్నారు. అందువల్ల ప్రమాద బీమా ఉన్నట్లయితే ఆయా కుటుంబాలకు ఎంతో కొంత ఆసరా కలుగుతుందని చెప్పారు. ఈ విషయంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తగిన విధంగా స్పందించాలని కోరారు. జర్నలిస్టుల భద్రతకు సంబంధించిన చర్యలను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర అధికారులకు రాష్ట్ర అధికారులు నివేదించాల్సిందిగా యాదగిరి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మరిన్ని వర్క్ షాప్ లను ఏర్పాటు చేసి వృత్తి నైపుణ్యాన్ని గ్రామీణ స్థాయి వరకు విస్తరించాల్సిందిగా కోరారు. దీనికి పి ఐ బి అదనపు డీజీ శృతి పాటిల్ సానుకూలంగా స్పందించారు. ఉన్నతాధికారులకు నివేదిక తెలియజేస్తామన్నారు