జిల్లా లో డిజిటల్ హెల్త్ కార్డుల అమలుకు సమగ్ర యాక్షన్ ప్లాన్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జీజీహెచ్ వరకు పూర్తి ఏర్పాట్లు
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న డిజిటల్ హెల్త్ కార్డుల నమోదు కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించడానికి డిజిటల్ హెల్త్ కార్డుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు.
మంగళవారం ఉదయం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు,జిల్లా వైద్య అధికారులతో డిజిటల్ హెల్త్ కార్డు ప్రక్రియ
సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే అంశాలపై సమీక్ష
సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన ఆరోగ్య సేవలు అందించడంలో డిజిటల్ హెల్త్ కార్డులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి అర్హుడికి హెల్త్ ఐడి నమోదు జరిగేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ అమలు పై అవగాహన, అవసరమైన సిబ్బంది ,పరికరాలు, ప్రాథమిక నివేదిక ను సిద్ధం చేయాలన్నారు.
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని వైద్యాధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
నమోదు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు తగిన సిబ్బంది నియామకం, సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, ఓపీ కేంద్రాలను సిద్ధం చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం వసంతరావు , వైద్యాధికారులు డాక్టర్ శశాంక్, డాక్టర్ నాగ నిర్మల ,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.