- న్యూ ఎనర్జీ పాలసీ తీసుకురావడంతో గత ప్రభుత్వం నిర్లక్ష్యం
- రాబోయే రోజుల్లో సమృద్ధిగా విద్యుత్ సరఫరా అందిస్తాం
- ఆర్థికంగా, ఆరోగ్యంగా విద్యుత్ శాఖను నిలబెట్టడానికి ప్రతి నెల సబ్సిడీలు చెల్లిస్తున్నాం
- ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది
- తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి
ముద్ర, తెలంగాణ బ్యూరో :- ప్రపంచంతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడాలని ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన న్యూ ఎనర్జీ పాలసీ వల్ల రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు రాబోతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఖైరతాబాద్ లోని ది ఇన్స్ ట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ భవనంలో తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పది సంవత్సరాలు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురాకుండా చేసిన నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర అభివృద్ధికి అన్యాయం జరిగిందన్నారు. న్యూ ఎనర్జీ పాలసీ నాలుగు గోడల మధ్య తయారు చేయలేదన్నారు. దేశంలో అందరి అభిప్రాయాలు తీసుకొని పెద్ద ఎత్తున కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడులు రావడానికి అనుగుణంగా ఈ పాలసీని రూపొందించినట్లు వివరించారు.

రాబోయే వేసవిలో పరిశ్రమలకు, వినియోగదారులకు, వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్తు ను సంపూర్ణంగా, సమృద్ధిగా సరఫరా చేస్తామన్నారు. ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎనర్జీ సెక్రటరీ నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు ఎలాంటి ఇంట్రప్షన్ లేకుండా క్వాలిటీ పవర్ సరఫరా చేయడానికి సమయతమైనారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక బాధ్యతలో భాగంగా వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత కరెంటుకు సంబంధించి రైతులు చెల్లించాల్సిన బిల్లులను ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.12,486 కోట్లు చెల్లించిందన్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్తు వల్ల డిస్కంలపై భారం పడకుండా రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి రూ.1538 కోట్లు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించిందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు అందిస్తున్న ఉచిత కరెంటుకు గాను రూ. 199 కోట్లు ప్రభుత్వం విద్యుత్ శాఖకు చెల్లించిందన్నారు. విద్యుత్ సంస్థ ఆరోగ్యంగా, ఆర్థికంగా ఉండాలని ప్రజా ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. విద్యుత్తు శాఖ ఆర్థికంగా నిలదొక్కుకోని ఉంటే ఈ రాష్ట్రానికి మంచిది అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా రాష్ట్ర మంత్రులు అందరూ ఈ సూత్రాన్ని నమ్ముతూ ఆచరిస్తున్న ఉందన్నారు. అందులో భాగంగానే ప్రతి నెల విద్యుత్ శాఖకు ప్రజలకు ఇచ్చిన సబ్సిడీ డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తున్నదని తెలిపారు.
నూతన సబ్ స్టేషన్ లను మంజూరు చేసే క్రమంలోనే మ్యాన్ పవర్ ను మంజూరు చేయాలని కోరిన ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన సూచనను తప్పనిసరిగా పరిశీలిస్తామని వెల్లడించారు. విద్యుత్ శాఖలో ఏండ్ల తరబడి వేచి చూస్తున్న 5 వేల మందికి ఒకేసారి ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం పదోన్నతులు కల్పించిందన్నారు. కారుణ్య నియామకాలను భర్తీ చేయడంతో పాటు, కొత్త నియామకాలు కూడా చేశామని వివరించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సస్పెండ్ కావడంతో 2001 నుంచి గత ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. దీంతో ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిందన్నారు. ప్రజా ప్రభుత్వ అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్, భద్రాద్రి, థర్మల్ పవర్ స్టేషన్ ఇతర హైడల్ ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావడానికి క్యాలెండర్ రూపొందించుకొని నిరంతరం పర్యవేక్షణ చేపట్టడం వల్ల వైటీపీఎస్ యూనిట్-2ను అతి కొద్ది కాలంలోనే వినియోగంలోకి తీసుకువచ్చామని వెల్లడించారు.
హైడల్ ప్రాజెక్టులోని మోటర్లు కాలిపోవడంతో గత ప్రభుత్వం గాలికి వదిలేసిన వాటిని క్షేత్రస్థాయిలో సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని వినియోగంలోకి తీసుకురావడం కోసం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చి వాటిని వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నం ప్రజా ప్రభుత్వం చేసిందని వివరించారు. పాలకులు చెప్పినట్టుగా సమాజ హితం కోసం పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి ప్రజా ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచన చేస్తుందన్నారు. ఉద్యోగుల వ్యవస్థకు కావలసిన సహకారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఇప్పుడు, ఎప్పుడు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు, యూనియన్ నేతలు మేనే జ్ మెంట్ – కూర్చొని చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందన్నారు. ఉద్యోగుల భావ వ్యక్తీకరణకు తమ ప్రభుత్వంలో సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుందన్నారు. సమాజానికి జవాబుదారీగా పారదర్శకంగా సేవలు అందించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు అన్నారు. ప్రతిరోజు మనం చేసిన పనులను ఆత్మ విమర్శ చేసుకుంటే చేస్తున్న ఉద్యోగ ధర్మానికి న్యాయం చేసిన వారమవుతామని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎనర్జీ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్, ఆ సంఘం అధ్యక్షులు రత్నాకర్ రావు, ప్రధాన కార్యదర్శి సదానందం, యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు జనప్రియ తదితరులు పాల్గొన్నారు.