Take a fresh look at your lifestyle.

కొత్తగా 62 వేల మందికి రైతు భరోసా

కొత్త పాస్ పుస్తకాలు ఉన్న వారికీ ఇవ్వాలని సర్కార్ నిర్నయం
దరఖాస్తుల పరిశీలన తర్వాత తుది జాబితా
ఈ నెల 20లోపు రెండో విడత భరోసా

ముద్ర, తెలంగాణ బ్యూరో :

కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందినవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు కొత్త పాస్ బుక్కులు వచ్చిన వారికి రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే అప్లై చేసుకున్న 62 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి.. నిజానిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత.. తుది జాబితాను రెడీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఆ పధకానికి రైతు భరోసాగా పేరు మార్చి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోంది. అయితే కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి మాత్రం ఈ రైతు భరోసా అందడం లేదు. దీంతో ఆ రైతులు తమకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల విజ్ఞప్తులపై స్పందించిన ప్రభుత్వం.. వారికి కూడా రైతు భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో కొత్తగా పట్టాదారు పాసు బుక్కులు వచ్చిన రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు పాత లబ్ధిదారులకే అమలు చేస్తున్న రైతు భరోసా పథకాన్ని.. కొత్తగా భూములు కొనుగోలు చేసి.. పట్టాలు పొందిన రైతులకు కూడా వర్తింపజేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ బుక్కులు పొందినవారు సుమారు 85 వేల మంది రైతులు ఉన్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ 85 వేల మందిలో ఇప్పటికే 62 వేల మంది అన్నదాతలు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేస్తోంది. రైతు భరోసా పథకానికి ఆ రైతులు అర్హత కలిగి ఉన్నారా.. వారి భూమి వివరాలు.. పట్టాదారుల నిజానిజాలను నిర్ధారించిన తర్వాత పది రోజుల్లో అర్హులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్‌ను అధికారులు సిద్ధం చేయనున్నారు.

ఈ నెల 20లోపు రెండో విడత భరోసా
రైతు భరోసా పథకానికి అర్హులుగా తేలిన కొత్త అన్నదాతలకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి 20వ తేదీల మధ్య యాసంగి రెండో విడత రైతు భరోసా నిధులను.. వారి బ్యాంకు అకౌంట్లలో జమా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సీజన్‌లో సుమారు రూ. 9 వేల కోట్లను అన్నదాతల అకౌంట్లలో జమా చేసే లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో గత వానాకాలం సీజన్‌లో లబ్ధి పొందిన ప్రతీ రైతుకు.. ఈ యాసంగి సీజన్‌లో కూడా ఎలాంటి కోతలు లేకుండా పూర్తిస్థాయి పెట్టుబడి సాయం అందనుంది. ఇదీలావుంటే.. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో సుమారు 69.39 లక్షల మంది అన్నదాతలకు ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ. 8,744.13 కోట్లు.. కేవలం 9 రోజుల వ్యవధిలోనే అకౌంట్లలో జమ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఇక రైతు భరోసా పథకం లబ్ధిదారుల సంఖ్యలో 5.22 లక్షల మందితో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 3.53 లక్షలతో సంగారెడ్డి.. ఖమ్మం 3.35 లక్షలు.. సిద్ధిపేట జిల్లా 3.18 లక్షలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.