Take a fresh look at your lifestyle.

ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలి

  • డొనేషన్ల పేరుతో అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్న కాలేజీలు.
  • ఉన్నత విద్యమండలి కార్యదర్శికి ఏఐఎస్ఎఫ్ వినతిపత్రం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలికి ఏఐఎస్ఎఫ్ విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు గురువారం ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరామ వెంకటేష్‌ను ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ నేతృత్వంలోని సభ్యుల బృందం కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు చేస్తున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి కార్యదర్శిని  కోరామని చెప్పారు.రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ప్రస్తుత  విద్యా సంవత్సరం నుండి బీటెక్ ఫీజులు పెంచాలని టీజీఎఫ్ఆర్సీ ముందు పెట్టిన ప్రతిపాదనలను ఉన్నత విద్యామండలి, టీజీఎఫ్ఆర్సీ, తిరస్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఒక్కో కళాశాల వారు ప్రస్తుతం ఉన్న ఫీజులో 50% పైగా ఫీజులు పెంచాలని ప్రతిపాదించడం దారుణమని వారు తెలిపారు.ఇప్పటికే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు అధిక ఫీజుల దోపిడి చేస్తున్నాయని, యాజమాన్యకోట సీట్లను లక్షలాది రూపాయలకు అమ్ముకుంటూ విద్యా వ్యాపారం చేస్తున్నాయని వారు ఆరోపించారు.డిమాండ్ ఉన్న కోర్సు సీట్లకు ఇష్టానుసారంగా భారిగా ఫీజులు పెంచుతున్నారని తెలిపారు.సీట్లను బ్లాక్ లో పెడుతూ మెరిట్ విద్యార్థులకు ఇవ్వకుండా లక్షల రూపాయల ఫీజులు కట్టేవారికి సీట్లు ఇస్తున్నారని, కొన్ని కోర్సులకు విపరీతమైన డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఆ సీట్లకు అడ్మిషన్ల కొరత సృష్టించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు రాబడుతున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య పేదవారికి అందే అవకాశం లేకుండా పోతుందన్నారు.  ఇంజనీరింగ్ కళాశాలలు యాజమాన్య సీట్ల భర్తీలో భారీగా  అక్రమాలు చేస్తున్నాయని అనేక ఇంజనీరింగ్ కళాశాలలు నిబంధనలు పాటించడం లేదని,అధికారులు తనిఖీలకు వెళ్ళే సమయంలోనే విద్యార్హత కలిగిన టీచింగ్ సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకుంటూ, లేని సౌకర్యాలను ఉన్నట్టుగా చూపిస్తూన్నారని అన్నారు. తనిఖీల  అనంతరం విద్యార్హత లేనివారితో కళాశాలలు నిర్వాహణ చేస్తూ, పలు ప్రైవేట్  ఇంజినీరింగ్ కళాశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని వారు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల దోపిడీనీ నియంత్రించాలని, ఇంజనీరింగ్ కళాశాలల వారు చేసిన ఫీజుల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం, విద్యాశాఖ తిరస్కరించి ఇంజనీరింగ్ విద్య అందరికీ అందుబాటులో ఉండే ఫీజులను నిర్ణయించాలని  వారు  డిమాండ్ చేశారు. ఉన్నత విద్యామండలి కార్యదర్శిని  కలిసిన వారిలో  ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, గ్యార నరేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సామిడి వంశీవర్ధన్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు చైతన్య యాదవ్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.