Take a fresh look at your lifestyle.

ఎన్నిక‌ల బ‌దిలీలే ఏకైక ఉమ్మ‌డి ఎజెండా..!

  • ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి బ‌దిలీల స‌మ‌స్య‌.
  • రెవెన్యూ ఉద్యోగ సంఘాల స‌మావేశంలో వి.ల‌చ్చిరెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నిక‌ల బ‌దిలీలే ఏకైక ఉమ్మ‌డి ఎజెండాగా చేసుకొని ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్దామ‌ని ఉద్యోగులకు డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్య‌క్షులు వి.లచ్చిరెడ్ఖి పిలుపునిచ్చారు.సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా జ‌రిగే ఎన్నిక‌ల బ‌దిలీల‌ను ఇప్పుడు చేసుకోక‌పోతే, భ‌విష్య‌త్తులో మ‌రెప్పుడూ కూడా చేసుకోలేమని అన్నారు.ఈ అవ‌కాశాన్ని రెవెన్యూ ఉద్యోగులుగా మ‌న‌మంతా కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌న్నారు.ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఆధ్వర్యంలో వి.లచ్చిరెడ్ఖి నేతృత్వంలో రెవెన్యూ సంఘాల‌తో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఐఏఎస్ అధికారుల‌తో ఏర్పాటు చేసిన త్రి స‌భ్య క‌మిటీ దృష్టికి బ‌దిలీల అంశాన్ని తీసుకెళ్దామ‌ని అన్నారు.రెవెన్యూ శాఖ‌లోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులు, స‌మ‌స్య‌లు ఉన్నాయ‌న్నారు. కానీ, అన్నింటి కంటే అతి కీల‌క‌మైన‌వి ఎన్నిక‌ల బ‌దిలీలేన‌ని ఆయన తెలిపారు. ఈ బ‌దిలీల అంశాన్నే రెవిన్యూ ఉద్యోగులంతా ఉమ్మ‌డిగా ఏకైక ఎజెండాగా రూపొందించుకోవాల‌ని ఆయన సూచించారు. మ‌న రెవెన్యూ విభాగం వైపు నుంచి ఏకైక అంశంగా ఎన్నిక‌ల బ‌దిలీలు ప్ర‌ధాన‌మైన డిమాండ్‌గా క‌మిటీ ముందు పెట్టి ప‌రిష్క‌రించుకోవాల్సిన అవ‌స‌రం ఉందన్నారు.ఎన్నిక‌ల బ‌దిలీలు జ‌రిగి సుమారు రెండేళ్లు కావ‌స్తోందన్నారు.ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగియ‌గానే సాధార‌ణంగానే జ‌ర‌గాల్సిన డీటీ, త‌హ‌శీల్దార్ల బ‌దిలీలు నేటికి కూడా జరగలేదన్నారు.ఎన్నికల స‌మ‌యంలో బ‌దిలీపై వ‌చ్చిన డిప్యూటీ త‌హ‌శీల్దార్లు, త‌హ‌శీల్దార్లను త‌క్ష‌ణ‌మే వారి పూర్వ జిల్లాల‌కు బ‌దిలీ చేయాలని ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఎంతై ఉందన్నారు.స‌కాలంలో బ‌దిలీలు జ‌రగ‌క‌పోవ‌డంతో ఆయా కుటుంబాలు తీవ్ర వేద‌న‌కు గుర‌వుతున్నాయ‌ని గుర్తు చేశారు. ముఖ్యంగా పిల్ల‌ల చ‌దువులు, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో రెవెన్యూ ఉద్యోగుల కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయని ఆయన తెలిపారు.ఇలాంటి ప‌రిస్థితులో మ‌న‌మంతా రెవెన్యూ కుటుంబంగా ఐక్య‌త‌తో ఐఏఎస్ అధికారుల త్రి స‌భ్య కమిటీ, ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి ఎన్నిక‌ల బ‌దిలీల అంశాన్నే ఏకైక ఉమ్మ‌డి ఎజెండాగా తీసుకెళ్లి త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉందన్నారు.ద‌శ‌ల వారీగా ఈ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టేందుకు స‌మావేశంలో కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించిన‌ట్టుగా చెప్పారు.ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ‌, తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌(టీజీటీఏ) రాష్ట్ర అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు ఎస్‌.రాములు, ర‌మేష్ పాక‌, తెలంగాణ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్‌(టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, టీజీటీఏ రాష్ట్ర సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ పూల్‌సింగ్ చౌహాన్‌, మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు రాధా, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.