Take a fresh look at your lifestyle.

సమాజంపై ప్రభావితం చూపేలా ప్రభుత్వ పాఠశాలలను గొప్పగా తీర్చిదిద్దండి

  • పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించండి
  • ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన
  • షాదనగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద జెడ్పి హైస్కూలు 150 వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

(ముద్ర ప్రతినిధి – ఉమ్మడి రంగారెడ్డి జిల్లా): సమాజంలో ప్రభుత్వ పాఠశాలల ప్రభావాన్ని పెంచే విధంగా.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచించారు.శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పాఠశాలలో బూర్గుల రామకృష్ణారావు, సత్యానారాయణ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి పెద్దలు చదివిన పాఠశాలకు ఎంతో విశిష్టత ఉందని అన్నారు. అలాంటి పెద్దలు చదివిన పాఠశాలకు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పాఠశాల ఈ సమాజానికి మేధో సంపదను అందిస్తూనే ఉందని అన్నారు. ఈ గ్రామంలో పోలీసు స్టేషన్, గ్రాంధాలయం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ గ్రామంలో 16 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను చేపడతామని తెలిపారు. అదే విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్ర, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని, విద్యార్థులకు చేసేది ఖర్చు కాదని పెట్టుబడిని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు బూర్గుల రామకృష్ణారావు సత్యానారాయణ రెడ్డి మర్రి చెన్నారెడ్డి పి.వి నర్సింహా రావు, జైపాల్ రెడ్డి, హరగోపాల్ లాంటి గొప్ప గొప్ప నాయకులను తయారు చేసి అందించారని తెలిపారు. విద్యాశాఖను నిర్విర్యం కాకుండా అభివృద్ధి చేయుటకు సంకల్పించామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలోనే 11 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, 21 వేల మంది టిచర్లకు పదొన్నతులు, 35 వేల మంది టిచర్లకు బదిలీలు చేయడం జరిగిందని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీలను పెంచామని తెలిపారు. విద్యార్థులకు విద్య, క్రీడల తోపాటు వారిలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 1250 ప్రైవేటు పాఠశాలల్లో 31 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులకు విద్యార్హతలు అనుభవం మెండుగా ఉన్నాయి. మనలో ఉన్న లోపాలను సవరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మట్టి మాణిక్యాలను వెలికి తీయడానికి కృషి చేస్తామని అన్నారు.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్లుతున్నామని, ప్రోఫెసర్ల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలకు పెంచడం ద్వారా విద్యార్థులకు వారి మంచి బోధనను అందించడం జరుగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇవి నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.