- పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం.
- రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి.
- గువ్వల గూడెంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ.
పాలేరు, ముద్ర విలేకరి: పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రాబోయే మూడున్నర ఏళ్లలో మొదటి విడత మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లను కలుపుకొని 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామనిచెప్పారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి నేలకొండపల్లి మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. గువ్వలగూడెం గ్రామంలో రూ. 30 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, గ్రామంలోని రావెళ్ల భూలక్ష్మి నరేష్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా దంపతులకు కొత్త బట్టలు అందించారు. గ్రామంలో ఇంటి ముందు అడ్డంగా ఉన్న విద్యుత్ పోల్ను తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అనంతరం కోరట్లగూడెంలో షుగర్ ఫ్యాక్టరీ రోడ్ నుండి పాత కోరట్లగూడెం వరకు రూ. 2 కోట్ల 50 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణానికి, మోటాపురం గ్రామంలో మోటాపురం నుండి జీళ్లచెరువు ఆర్ అండ్ బి రోడ్డు వరకు రూ. 4 కోట్ల 40 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వమన్నారు. ఇళ్ళు మంజూరు కాని వాళ్ళు బాధ పడాల్సిన అవసరం లేదని, రాబోయే మూడున్నర సంవత్సరాలలో నాలుగున్నర లక్షలతో కలిపి 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం పేదవాడి కన్నీరు తుడిచే విధంగా, పేద వాడికి అండగా, పేదవాడికి సహాయం చేసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్, పేదోడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు మెరుగైన వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆడ బిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలలో 17 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేస్తే, ఇందిరమ్మ ప్రభుత్వం10 నెలల్లోనే 21 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేసిందన్నారు. ప్రభుత్వం రైతులకు సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ అధనంగా అందిస్తుందని, ఉగాది నుండి పేదలకు సన్న రకం బియ్యం సరఫరా చేస్తుందని, గత పది సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డు ఇవ్వడం గానీ, కొత్త పేర్లు రేషన్ కార్డులో చేర్చడం కానీ జరగ లేదన్నారు.ఇందిరమ్మ ప్రభుత్వంలో కొత్త కార్డులు కూడా మంజూరు చేశామని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు తదితరులు పాల్గోన్నారు.
