Take a fresh look at your lifestyle.

మెట్రో ఛార్జీలు పెంపు

  • మెట్రో ప్రయాణికులకు షాక్.
  • పెరిగిన టికెట్ ధరలు.
  • రేపట్నుంచి కొత్త ధరలు.
  • కనీస ఛార్జీ రూ. 12 , గరిష్ట ఛార్జీ రూ.75.
  • ప్రకటించిన ఎల్ అండ్ టీ.

ముద్ర, తెలంగాణ బ్యూరో : మెట్రో ప్రయాణ టికెట్ ధరలు పెంచుతూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు రేపట్నుంచి ( 17వ తేదీ) అమల్లోకి వస్తాయని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కనిష్ఠ ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు, గరిష్ఠ ఛార్జీ రూ. 60 నుంచి రూ. 75కు పెరిగాయి. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటంతోనే ఈ ఛార్జీల పెంపు అనివార్యమైనట్లు సంస్థ పేర్కొంది. కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిందని గతంలోనే మెట్రో అధికారులు వెల్లడించారు. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా మెట్రో రైలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఛార్జీలు పెంపు ఒక్కటే మార్గంగా మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా రూ.150 నుంచి రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఛార్జీల పెంపు మెట్రో సేవలను కొనసాగించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం సామాన్య ప్రయాణికులపై ఆర్థిక భారం మోపనుంది. కాగా, మెట్రో రైల్వేస్ చట్టం 2002లోని సెక్షన్ 34 ప్రకారం, చార్జీల సవరణ స్వరూపాన్ని సిఫార్సు చేసేందుకు హైకోర్టు మాజీ జడ్జి సారథ్యంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటైందని మెట్రో అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ 2023, జనవరి 25న సవరించిన చార్జీల స్వరూపాన్ని సిఫార్సు చేస్తూ నివేదికను సమర్పించిందన్నారు. మెట్రో రైల్వే ఓ అండ్ ఎం చట్టంలోని సెక్షన్ 37 ప్రకారం.. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. 0- 2 కి.మీ వరకు రూ. 12.00 ( ఇదే కనిష్ఠం), 2- 4 కి.మీ వరకు రూ.18.00, 4- 6 కి.మీ వరకు రూ. 30.00, 6-9 కి.మీ వరకు రూ.40.00, 9 -12 కి.మీ వరకు రూ.50.00, 12-15 కి.మీ వరకు రూ.55.00, 15-18 కి.మీ వరకు రూ.60.00, 18- 21 కి.మీ వరకు రూ.66.00, 21-24 కి.మీ వరకు రూ.70.00గా ఉంది. 24 కి.మీ ఆపైన రూ. 75.00 ( ఇదే గరిష్ఠం. ఎల్బీనగర్ నుంచి చివరి స్టేషన్ మియాపూర్ రూ. 75)గా ఉంది.

Leave A Reply

Your email address will not be published.