- ఆర్టీసీ కార్మికులు రాజకీయ ప్రేరేపణలకు తలొగ్గొద్దు.
- పంతాలు, పట్టింపులకు పోయి ఇబ్బందిపడొద్దు.
- ఆర్టీసీ ఆదాయం మీ చేతిలోనే పెడ్తాం.. మీరే ఖర్చు చేయండి.
- కార్మికుల పోరాట ఫలితమే వారానికి ఒకరోజు సెలవు.
- ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి హితవు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాజకీయ ప్రేరేపణలకు తలొగ్గి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆ సంస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుందని చెప్పారు. ఇప్పుడిప్పుడే లాభాల బాటలో పయనిస్తున్న ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉందన్నారు.పంతాలు, పట్టింపులకు పోవద్దని ఆర్టీసీ కార్మికులకు సూచించారు.ఏదైనా సమస్య ఉంటే నేరుగా మంత్రితో చర్చించాలని సూచించారు.గురువారం రవీంద్రభారతిలో శ్రమశక్తి, ఉత్తమ యాజమాన్య అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ద్వారా వస్తున్న ఆదాయం అంతా మీ చేతిలో పెడతామని ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయాలని ఆ సంస్థ కార్మికులను ఉద్దేశించి చెప్పారు. ఆర్టీసీ నుంచి వస్తున్న అణా పైసా కూడా తాను ఇంటికి తీసుకెళ్లడం లేదన్నారు.ప్రతి పైసా మీ కోసమే ఖర్చు చేస్తామని చెప్పారు. గత పదేండ్లలో రాష్ట్రంలో ఆర్ధిక దోపిడీ జరిగిందన్నారు.ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదనీ దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులందరూ ఒకసారి ఆలోచన చేయాలన్నారు.కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం స్పష్టం చేశారు. పదేండ్లు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా, ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోని వారి మాట వలలో పడొద్దని హితవుపలికారు. తనను నమ్ముకున్న ప్రతి ఉద్యోగికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
- కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ అభివృద్ధికి బాటలు..!
కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని సీఎం వెల్లడించారు. ప్రపంచంలో ఎన్ని విప్లవాలు వచ్చినా కార్మికుల ఉద్యమం ప్రత్యేకమని చెప్పారు.తెలంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిదని గుర్తు చేశారు.స్వరాష్ట్ర పాలనలో కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకువెళుతున్నామని రేవంత్ రెడ్డి వివరించారు.నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉండడానికి కార్మికుల సహకారమే కారణమని చెప్పారు. గుజరాత్ లో కూడా ఏడాదిలో 58 వేల ఉద్యోగాలు ఇచ్చారా? అని సీఎం బీజేపీ నేతలను ప్రశ్నించారు.వారానికి ఒకరోజు సెలవు కార్మికుల పోరాట ఫలితమే అన్నారు.సింగరేణి లాభాలలోకార్మికులకు వాటా ఇచ్చి బోనస్ ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని సీఎం చెప్పారు.గత పదేళ్ల నిర్లక్ష్యంతో విద్యుత్ వ్యవస్థ కుప్ప కూలే పరిస్థితి వచ్చిందన్న సీఎం పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు వివరించారు. త్వరలోనే అసంఘటిత కార్మికుల కోసం గిగ్ వర్కర్స్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నామని సీఎం చెప్పారు.గత ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపిందనీ ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసి 50మంది కార్మికులను పొట్టన పెట్టుకుందని ఆరోపించారు.గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో ఆర్ధిక దోపిడీ జరిగిందని సీఎం ఆరోపించారు.గత పాలకులు కాంట్రాక్టర్లకు రూ.50వేల కోట్లు, ఇతర విభాగాల్లో రూ. 1.20లక్ష కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టారని సీఎం ఆరోపించారు. సర్పంచులకు బకాయిలు గత ప్రభుత్వం ఘనకార్యమే అని చెప్పారు. తాము అధికారం చేపట్టే నాటికి ప్రతీ సంస్థలో రూ. 8.29లక్షల కోట్లు అప్పు తమ నెత్తిన ఉందన్నారు.