యూసీఎఫ్ కింద మూడు ప్రాజెక్టులకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం
రూ.895 కోట్ల మంజూరు ప్రతిపాదనలకు ఓకే?
కరీంనగర్ మేయర్ పదవి బీజేపీకి అప్పగిస్తే వరద నిధులు పారిస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన బండి
ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రిని కలిసిన సంజయ్
యూసీఎఫ్ స్కీంలో కరీంనగర్ ను చేర్చాలని విజ్ఝప్తి
సంజయ్ విజ్ఝప్తికి కేంద్రం సానుకూల స్పందన
వెంటనే ప్రతిపాదనలు పంపాలని రాష్ట్రాన్ని కోరిన కేంద్రం
కేంద్రం సూచన మేరకు ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం
నేడు కరీంనగర్ కు రానున్న కేంద్ర అధికారుల బ్రుందం
ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు మహార్ధశ పట్టనుంది. స్మార్ట్ సిటీ పేరుతో ఇప్పటికే కరీంనగర్ కు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తాజాగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీం కింద మరో మూడు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.895 కోట్లు. అందులో భాగంగా పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్కైవాక్‌లు, నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాలతోపాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ. 700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. అట్లాగే వర్షపు నీటి కాలువల నిర్మాణం, పునరావాసం, వరద నివారణ చర్యల కోసం రూ.130 కోట్లు కేటాయించనుంది. అట్లాగే కరీంనగర్‌లో సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ రూ.65 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు చెందిన అపెక్స్ కమిటీ ఇటీవల ఢిల్లీలో సమావేశమై ఈ ప్రతిపాదనలపై చర్చించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అందులో భాగంగా కమిటీ ఆదేశాల మేరకు రేపు (శనివారం) కేంద్ర అధికారుల బ్రుందం కరీంనగర్ కు రానుంది. కరీంనగర్ లో పర్యటించడంతోపాటు స్థానిక అధికారులతో సమావేశం కానున్నారు.
ఫలించిన బండి సంజయ్ క్రుషి
యూసీఎఫ్ స్కీంలో కరీంనగర్ ను చేర్చడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన క్రుషి ఫలించింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీకి అప్పగిస్తే నిధులు వరద పారిస్తానంటూ బండి సంజయ్ హామీ ఇచ్చారు. కరీంనగర్ ప్రజలు మేయర్ పదవిని కాషాయ పార్టీకి అప్పగించడంతో ఇచ్చిన నిధులు తీసుకురావడంపైనే ద్రుష్టి సారించారు. అందులో భాగంగా ఇటీవల 15వ ఆర్ధిక సంఘం నిధుల కింద కార్పొరేషన్ కు రూ.10 కోట్లు మంజూరయ్యాయి. దీంతోపాటు స్మార్ట్ సిటీ లో భాగంగా కార్పొరేషన్ కు రూ.70 కోట్లు వచ్చాయి. కరీంనగర్ రూపురేఖలు మార్చాలంటే ఈ నిధులు సరిపోవని భావించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివ్రుద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలిశారు. తెలంగాణలో ఒకే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుందని పేర్కొంటూ అభివ్రుద్ధిలో కరీంనగర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. అందులో భాగంగా యూసీఎఫ్ స్కీంలో కరీంనగర్ ను చేర్చాలని విజ్ఝప్తి చేశారు.
బండి సంజయ్ విజ్ఝప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం… తగిన ప్రతిపాదనలను పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్రం లేఖను ద్రుష్టిలో ఉంచుకుని రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు కరీంనగర్ కార్పొరేషన్ అధికారులతో పలుమార్లు సమావేశమై ప్రతిపాదనలను రూపొందించి కేంద్రానికి పంపారు. కేంద్రంలోని పట్టణాభివ్రుద్ధి శాఖ ఉన్నతాధికారుల అపెక్స్ కమిటీ రెండ్రోజుల క్రితం ఈ ప్రతిపాదనలకు సూత్రప్రాయ ఆమోదం తెలిపడంతోపాటు కరీంనగర్ లో పర్యటించి ఆయా ప్రతిపాదనలపై రాష్ట్ర అధికారులతో చర్చించాలని కేంద్ర అధికారుల బ్రుందాన్ని ఆదేశించింది. కేంద్ర ఆదేశాల మేరకు అధికారుల బ్రుందం రేపు (శనివారం) కరీంనగర్ లో పర్యటించనుంది. ప్రతిపాదనల్లో పేర్కొన్న ప్రాజెక్టుల నిర్మాణంపై అధికారులతో చర్చించనుంది.