ముద్ర,గద్వాల:
అసెంబ్లీలో మంత్రులు, ప్రతిపక్ష నేతల మధ్య ప్రజా సమస్యలపై వాదోపవాదాలు జోరుగా సాగుతుంటాయి. శాసనసభ కార్యకలాపాలను విద్యార్థులకు మరింత అవగతం చేసేందుకు గద్వాలలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో విద్యార్థినీలకు మాక్ అసెంబ్లీ సెషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలు అసెంబ్లీ సెషన్ లో రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ సభ్యులుగా పాల్గొని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ సమాధానాలు చెప్పడం వంటి వంటి వాటిని అనుసరించడం జరిగింది. ప్రజా సమస్యలపై చర్చలు, సంక్షేమ బిల్లుల ప్రవేశపెట్టడం వంటి అంశాలను సమర్థంగా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.మీనాక్షి మాట్లాడుతూ
భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించే స్థాయికి ఎదగాలని విద్యార్థులను ఆశీర్వదించారు. చదువుతో పాటు రాజకీయాలపై.. అసెంబ్లీ సమావేశాలపై కూడా అవగాహన కల్పించిన మాక్ అసెంబ్లీ నిర్వహణను ఆమె ప్రశంసించారు.