Take a fresh look at your lifestyle.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో సీఎం ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ముద్ర,  జగిత్యాల: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్‌లో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అవగాహన మరియు శిక్షణ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ వసంత, రాయికల్ మున్సిపల్ చైర్మన్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా 10 కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, దీనిపై జిల్లా కలెక్టర్ ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.

కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక విజయవంతం కావాలంటే అధికారులు బాధ్యతగా పనిచేయాలని, ప్రజాప్రతినిధులు భాగస్వాములవాలని ఆయన పేర్కొన్నారు.

పుష్కరాల ఏర్పాట్లకు ముందస్తు చర్యలు

2027లో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సూచించినట్లు మంత్రి తెలిపారు. గతంలో ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఈసారి పుష్కరాలకు అవసరమైన పనులు ముందుగానే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సాగునీటి సమస్యలపై ప్రత్యేక సమావేశం

జగిత్యాల జిల్లాలో సాగునీటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అలాగే జిల్లాలోని గిరిజన గ్రామాలు, తండాలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.

జగిత్యాల సమీపంలోని చెల్‌గల్ గ్రామ భూముల్లో కేంద్రీయ విద్యాలయం లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి కేటాయించే చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. రాబోయే మూడు సంవత్సరాల్లో అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

సామాజిక బాధ్యతతో పనిచేయాలి

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతతో పనిచేయాలని సూచించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను పట్టించుకోకుండా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అన్నారు. మున్సిపాలిటీల్లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

మంత్రి అడ్లూరి మంచి మనసున్న నాయకుడు

కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ మాట్లాడుతూ పార్టీలు వేరైనా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంచి మనసున్న నాయకుడని కొనియాడారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకుని పనిచేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.