- ప్రజాభిప్రాయం మేరకే జనగణనలో కులగణన.
- బీసీలకు న్యాయం చేసేందుకు బీజేపీ కృషి.
- సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నందుకే కులగణన.
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కులగణన నిర్ణయం తమ విజయంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్ళలో కులగణన ఎందుకు చేయలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిలదీశారు.ఇది రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డికి భయపడి తీసుకున్న నిర్ణయం కాదన్నారు.సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉన్నందున కులగణన నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్‌లా ముస్లింలను బీసీల జనాభాలో చేర్చి మోసం చేయమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ, కర్ణాటకలో కులగణనను కాంగ్రెస్ తూతూమంత్రంగా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది నిజమైన కులగణన కాదని కిషన్‌రెడ్డి ఆరోపించారు.కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కుల గణన పేరుతో స్వార్థపూరిత రాజకీయాలకు తెరలేపాయన్నారు.కానీ,ప్రజాప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కిషన్ రెడ్డి మాట్లాడారు.జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని అన్నారు. ప్రజాభిప్రాయం మేరకు, సామాజిక సమరసతను దృష్టిలో ఉంచుకుని జనగణనలో భాగంగా కులగణన చేయాలని నిర్ణయించడం గొప్ప నిర్ణయమన్నారు. బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదని, దేశాన్ని దశాబ్దాల కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. మండల్ కమిషన్ నివేదికను కూడా కాంగ్రెస్ సర్కారు పక్కకు పెట్టిందన్నారు.కాంగ్రెస్ పార్టీ బీసీలను పక్కకుపెట్టి ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. 2011 జనగణనలో కులగణనను చేర్చాలని సుష్మాస్వరాజ్ ఆనాటి ప్రధానికి లేఖ రాశారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దేశంలో కులగణన జరిగితే బీసీలకు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయన్నారు.ఏ సామాజిక వర్గం వెనకబడి ఉందో గుర్తించవచ్చని చెప్పారు. వెనకబడిన వర్గాల వారికి ప్రత్యేక పథకాలను రూపొందించేందుకు ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ “సబ్కా సాత్, సబ్కా వికాస్” అనే సమ్మిళిత నినాదంతో పనిచేస్తుందని తెలిపారు. చారిత్రక సందర్భాన్ని ప్రస్తావిస్తూ 1881 నుండి 1931 వరకు కుల గణన ప్రక్రియలో భాగంగా ఉందని, కానీ స్వాతంత్ర్యం తర్వాత, కాంగ్రెస్ నాయకత్వంలో, 1951 నుండి కుల డేటా సేకరణ నిలిపివేయబడిందని వివరించారు. జవహర్‌లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్ వంటి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు కుల ఆధారిత గణనను బహిరంగంగా వ్యతిరేకించారన్నారు. మైనారిటీ జనాభా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినందున వారిని కూడా ఉద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ రాజీవ్ గాంధీ 1990లో పార్లమెంటులో మండల్ కమిషన్ సిఫార్సులను తిరస్కరించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.