ఫోరెన్సిక్ ఆడిట్‌తో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో అక్రమాల గుర్తింపు
త్వరలో 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్
ధరణి పోర్టల్ లొసుగులతోనే రిజిస్ట్రేషన్‌లలో అక్రమాలు
9 జిల్లాల్లోని 35 మండలాల్లో 48 మందిపై క్రిమినల్ కేసులు
ధరణి పోర్టల్ అక్రమాలపై ఉన్నతస్ధాయి కమిటీ నివేదిక
మంత్రి శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో:
ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వారినీ రిజిస్ట్రేషన్‌ల చలానా సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూములను కాజేశారని ఆరోపించారు. దీనిపై సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్ధతో పైలట్ కింద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఇందులో అనేక అవినీతి అక్రమాలు జరిగినట్లు ప్రాధమిక నివేదికలో స్పష్టమైందని ఆయన తెలిపారు. ఈ ఫోరెన్సిక్ నివేదికను పరిశీలించిన తర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని ప్రకటించారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడిన సంఘటనలపై ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీతో శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు. విచారణలో ఎదురైన అంశాలు,ఎవరి పాత్ర ఎంత? తెరవెనుక ఎవరైనా ఉన్నారా? రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? వంటి అంశాలపై కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కమిటీ ప్రాధమిక నివేదికను పరిశీలించి మరికొన్ని సలహాలు సూచనలు చేస్తూ మరింత లోతైన విచారణ జరిపి తుది నివేదికను సమర్పించాలని సూచించారు.
ప్రాథమిక విచారణలోనే రూ. 4 కోట్ల అవినీతి
ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 35 లక్షల లావాదేవీలు జరిగాయని ఇందులో ప్రాధమికంగా 4,848 లావాదేవీల్లో లోటుపాట్లు జరిగినట్లు కమిటీ గుర్తించిందని మంత్రి తెలిపారు. విచారణ తర్వాత 1109 డాక్యుమెంట్లకు సంబంధించి రూ. 4 కోట్లుప్రభుత్వానికి చెల్లింపు జరగలేదని కమిటీ సభ్యులు వివరించారని తెలిపారు. గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా అనాలోచితంగా, కుట్రపూరితంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ లోని లొసుగులను ఆసరాగా చేసుకొని కొంతమంది అక్రమాలకు పాల్పడ్డారన్నారు. వీటిపై ఆరోపణలు రావడంతో భూభారతి పోర్టల్ ద్వారా ఆడిట్ నిర్వహించి అక్రమాలను గుర్తించి తక్షణమే ఉన్నతస్ధాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టామని తెలిపారు. ఇందుకు సంబంధించి తొమ్మిది జిల్లాల్లోని 35 మండలాల్లో అక్రమాలకు పాల్పడిన 48 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. వాస్తవ పరిస్దితి ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఓ నాయకుడు రూ. వెయ్యి కోట్ల అవినీతి అని, మరో నాయకుడు రూ. పదివేల కోట్లు అని ఇంకొక్కరు భూభారతి పోర్టల్ అవినీతిమయమని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
నేడు సర్వేయర్లకు లైసెన్స్‌లు
ఇప్పటికే మొదటి విడతలో నాలుగు వేల మంది శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లు జారీ చేయగా నేడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో మరో రెండు వేల మందికి లైసెన్స్‌లు జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ లైసెన్స్‌డ్ సర్వేయర్లతో రాష్ట్రంలో నక్షా లేని 373 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇంటిలిజెన్స్ అదనపు డిజి విజయ్‌కుమార్ ,ఉన్నతస్ధాయి కమిటీ సభ్యులు డీఐజీ ఎమ్. సుభాషిని, సీఎమ్ఆర్‌వో మకరంద్, ఎసీబీ ఎస్పీ సింధు శర్మ, సైబర్ క్రైమ్ డిఎస్పీ ఎ. సంపత్, ఎన్ఐసి ప్రతినిధి శ్రీనివాస్ , హోంశాఖ సలహాదారు పి. శరత్ కుమార్ పాల్గొన్నారు.