చర్యలు చేపట్టిన అధికారులు
సాఫ్ట్ వేర్ అప్ డేట్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రేషన్ పంపిణీకి సంబంధించి.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 నెలల బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే అందుకు ప్రధాన కారణం.. గత సీజన్లకు సంబంధించిన రేషన్ బియ్యం నిల్వలు పెరిగిపోవడంతో ఆ స్టాక్‌ను ఖాళీ చేసేందుకు.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో ఈ సీజన్ బియ్యం కూడా రానుండటంతో.. ఆలోగా ఉన్న నిల్వలను రేషన్ కార్డు దారులకు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. భారీగా రేషన్ బియ్యం గోదాముల్లో పేరుకుపోవడంతో.. ఆ స్టాక్ మొత్తం ఖాళీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వచ్చే 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ఒకే నెలలో పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని.. ఏప్రిల్ నెలలోనే సరఫరా చేయనుంది. అయితే ఏప్రిల్ నెల మొత్తం రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఒకేసారి 3 నెలల బియ్యం సరఫరాకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు.. రాష్ట్రంలో కొత్త రేషన్ దుకాణాలు కూడా అందుబాటులోకి రానున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
విరివిగా నిల్వలు
గత సీజన్లలో సేకరించిన ధాన్యం నిల్వలు పెరిగిపోవడం.. మరోవైపు మిల్లింగ్ పూర్తి అయి వచ్చిన బియ్యంతో గోదాముల్లో భారీగా నిల్వలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిల్వలను వెంటనే పంపిణీ చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు రేషన్ బియ్యం తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. రేషన్ బియ్యం సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వేలిముద్ర ఎలా..?
ఒకేసారి వేలిముద్ర వేస్తే లబ్ధిదారులకు 3 నెలల కోటాను అందించాలా లేక 3 నెలల రేషన్ కోసం 3 సార్లు వేయాలా అనే దానిపై అధికారులు చర్చిస్తున్నారు. ఒక్కొక్కరూ 3 సార్లు వేలి ముద్రలు వేయాలంటే.. రేషన్ దుకాణాల వద్ద బియ్యం సరఫరా ఆలస్యమై భారీగా క్యూ లైన్లు పెరిగిపోతాయనే ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి.. ఒకసారి వేలి ముద్ర వేసినా.. 3 నెలల బియ్యాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసి.. ఏప్రిల్ 1వ తేదీ నాటికి.. బియ్యం పంపిణీ చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) వద్ద భారీగా బియ్యం నిల్వలు పేరుకుపోయి ఉండడంతో.. కొత్తగా ఈ సీజన్‌లో వచ్చే ధాన్యానికి చోటు లేకుండా పోయింది. గత వర్షాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) భారీగా గోదాముల వద్దకు చేరుతోంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం.. ఆదివారం నుంచి రేషన్ షాపులకు సరఫరా అవుతోంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రేషన్ డీలర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకేసారి 3 నెలలకు సరిపడా స్టాక్‌ను అందుబాటులో ఉంచుకునేందుకు రేషన్ దుకాణాల్లో సరిపడా స్థలం లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకేసారి వందల క్వింటాళ్ల బియ్యాన్ని తమ వద్ద ఉంచుకునేంత పరిస్థితి లేకపోవడంతో.. డిమాండ్‌కు తగ్గట్లు రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా చేయలని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు.. ఏప్రిల్ నెల నుంచే.. రాష్ట్రంలో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభించనున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ షాపులను ఓపెన్ చేయడం వల్ల ప్రజలకు రేషన్ సరుకులను సరఫరా చేయడంలో మరింత వేగం పెరుగుతుందని తెలిపారు.