నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..
తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి..
ముద్ర, కరీంనగర్ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల కారణంగా కొనుగోలు ప్రక్రియ ఆలస్యమైందన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురి మార్కెట్ యార్డును సందర్శించిన మంత్రి, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం అమలు చేసిన ఆన్‌లైన్ విధానం, ట్రక్ షీట్లు, జీపీఆర్‌ఎస్ వంటి సాంకేతిక నిబంధనల కారణంగా ధాన్యం కొనుగోలు దాదాపు 15 రోజుల పాటు ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని నిబంధనలను సడలించి పాత విధానంలో కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యం, మక్కజొన్నను వారం నుంచి పది రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని, ధర్నాలు, రాస్తారోకోలు చేయవద్దని సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్లను అధికారులు సమన్వయంతో వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా సంబంధిత అధికారులకు లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, చిలుముల లక్ష్మణ్, వేముల రాజు, సౌళ్ల నరేష్, చీపురుశెట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.