Take a fresh look at your lifestyle.

క్లీన్ పాలిటిక్స్‌కు టీడీపీ కేరాఫ్ అడ్రస్‌

 

అమరావతి:

 

టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల శిక్షణా తరగతులు..
సీఎం చంద్రబాబు మార్గదర్శనం

సీఎం చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతులకు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో సమావేశమైన ఆయన, రాజకీయాలు–పరిపాలనలో గత అనుభవాలు, ప్రస్తుత సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై సమగ్రంగా వివరించారు.

క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై కార్యకర్తల నుంచి ఫీడ్‌బ్యాక్ స్వీకరించిన ముఖ్యమంత్రి, సోలార్ రూఫ్‌టాప్ వినియోగంపై కూడా అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవడంలో సోలార్ వినియోగం ఉపయోగకరమని పలువురు కార్యకర్తలు తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు కొత్తవి కాదని,ఎన్టీఆర్ హయాం నుంచే పార్టీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోందన్నారు. క్లీన్ అండ్ గ్రీన్‌తో పాటు క్లీన్ పాలిటిక్స్‌కు టీడీపీ కేరాఫ్ అడ్రస్‌గా నిలవాలని పిలుపునిచ్చారు. పాజిటివ్ పాలిటిక్స్ ద్వారా ఓట్ బ్యాంక్ పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు.

రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడుతూ, గతంలో ఐటీతో హైదరాబాద్ అభివృద్ధి చేసినట్టే ఇప్పుడు క్వాంటం టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ నెల 14న క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

సంక్షేమ కార్యక్రమాలపై వివరించిన ఆయన, ఎస్సీ–ఎస్టీలకు ఉచితంగా సోలార్ ఏర్పాటు, బీసీలకు రూ.20 వేల సబ్సిడీ, పీఎం కుసుమ్ పథకం కింద 2 కిలోవాట్ల వరకు సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు. అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించి ఆదాయం పొందే అవకాశముందని తెలిపారు.

గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సీఎం, విద్యుత్ ఛార్జీలను పలు మార్లు పెంచి ప్రజలపై భారం మోపిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని తగ్గించే చర్యలు తీసుకుంటోందన్నారు. సమగ్ర నీటి నిర్వహణతో భూగర్భ జలాలను పెంచి, మే 15 నుంచే పంటలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి “ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ (E3)” కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించిన ఆయన, రాజకీయాలు సేవ కోసం చేయాలని, జీవనోపాధిగా కాకూడదని సూచించారు. అలాగే కార్యకర్తల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, యోగా శిక్షణ కార్యక్రమాలు జిల్లాల వారీగా నిర్వహిస్తామని తెలిపారు.

సమావేశం అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.