Take a fresh look at your lifestyle.

గడ్డపారలతో దాడులు చేస్తు ప్రజలను రోడ్డున పడేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-రామచంద్ర రావు

 

 బాపు ఘాట్ లో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి పర్యటన ప్రారంభిస్తున్న భాజపా నాయకులు

– మూసి ప్రక్షాళన ఎక్కడి నుంచి ప్రారంభించాలో మొదలు నేర్చుకో
– ఎస్టీపీలు ఏర్పాటు చేసి చెరువులు నాళాలు శుద్ధి చేయండి
– మధు పార్క్ రిచ్ మినీ ఇండియాలాగా దేశ నలుమూలల ప్రజలు ఇక్కడ ఉంటున్నారు.
– ఆర్మీ మేజర్లకు కూడా గౌరవం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటారా.
– జెసిబి లు పెడతామంటే భాజపా తరఫున అందరము వచ్చి మళ్లీ ఇక్కడే బాధితుల ఇళ్లల్లో నిద్రిస్తాము.

 

ముద్ర ప్రతినిధి, బండ్లగూడ: అప్పుడు బిఆర్ఎస్, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ప్రజా పాలన గాలికి వదిలి జేబులు నింపుకోవడానికి అధికారంలోకి వచ్చిన మొదటి నుండి గడ్డపార పట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారమే ప్రధాన ఏజెండాగా ముందుకు వెళ్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసి నివాసిత బాధితులకు భరోసా కల్పిస్తూ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మూసి పరివాహక ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. మొదలు లంగర్ హౌస్ బాపు ఘాట్ లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అక్కడి నుండి పర్యటన ప్రారంభించారు. లంగర్ హౌస్ అంబేద్కర్ నగర్, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లు, గంధం గూడా, విఘ్నేశ్వర నగర్, కేకే నగర్, గండిపేట్ లలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పర్యటించి బాధితుల గోస విన్నారు.
గడ్డపారలు పట్టుకొని తిరుగుతున్నారు….
ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుండి కూడా హైడ్రా అని, ఫ్యూచర్ సిటీ అని, మూసి ప్రక్షాళన అని ఇలా ఎన్నో రకాలుగా రియల్ ఎస్టేట్ కోసం గడ్డపారలు పట్టుకొని ప్రజలపై దాడులకు దిగుతుందన్నారు. ప్రధాని మోడీ ఒక ఇల్లు కూడా కొల్చకుండా గంగా యమునా, సబర్మతిలను అభివృద్ధి చేశారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని టెక్నాలజీ ఉపయోగించి అడవిలో ఏర్పాటు చేశారని, దీనివల్ల అనేక ప్రాంతాల ప్రజలకు ఉపాధి దొరికిందన్నారు. ఇలా ప్రజలను రోడ్డుకు ఈడ్చకుండా వారికి ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలన్నారు. కొరియా లాంటి దేశాల్లో అధునాతన టెక్నాలజీ ఉపయోగించి మురుగునీరును కూడా సిద్ధం చేసి తిరిగి తాగుతూ ఆరోగ్యంగా ఉంటున్నారని అన్నారు. విదేశాల్లో కాలువల పక్కనే ఆకాశ హార్మోన్లు నిర్మించి ఆ ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారన్నారు. మూసికి లోతు తీసి, అటు ఇటు పటిష్టమైన ప్రహరీ గోడలు మొదలు నిర్మించాలని ఆయన సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం నేటికీ కూడా డిపిఆర్ ను ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. ఏ డి బి బ్యాంకు రుణాల కోసమే ఈ హడావుడి చేస్తుందని మండిపడ్డారు.

ఆదిత్య హోమ్స్ పై చర్యలేవి…
ఈ సందర్భంగా అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్సీ కొమరయ్యలు మాట్లాడుతూ…. నిబంధనల ప్రకారం మధు పార్క్ రిడ్జ్ నిర్మాణం జరిగిందని ఆర్డిఓ నే తెలిపారు అన్నారు. ఓ ఆర్ ఆర్ పక్కన ఆదిత్య హోమ్స్ వారు ఏకంగా మూసి ని మూసి వేశారన్నారు. ఇటీవల వరదలకు ఈ ప్రాంతం పూర్తిగా నీట మునిగి, వీరికి కబ్జా వల్ల రోడ్లు కూడా మునిగిపోయాయి అన్నారు. ఇక్కడ బఫర్ జోన్ మీకు కనిపించట్లేదా రేవంత్ రెడ్డి, ఈ భవనాలను కూల్చరా, వీరిపై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. తాము ఆధారాలతో పాటు మీ ముందుకు వస్తామని ఆదిత్య హోమ్స్ ఫోటోలను వారు ప్రదర్శించారు.

ఎలా ప్రక్షాళన చేయాలో తెలుసుకో…..
పర్యటనలో భాగంగా బాధితుల గోసవిన్న ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ……
మొదలు మూసి ప్రక్షాళన ఎలా చేయాలో తెలుసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. మల్కంచెరువు, దుర్గం చెరువు, ట్యాంక్ బండ్ వీటిలో ఎస్టీపీలు పనిచేయక దుర్గంధంగా మారాయి అన్నారు. నాళాలు కూడా ఇదే పరిస్థితిలో ఉండడంతో వాటి నుంచి వచ్చిన నీటితో మూసి మురుగు కాలువ లా మారిందని అన్నారు. ఎస్టీపీలు ఏర్పాటు చేసి చెరువులు నాళాలు శుద్ధి చేస్తే మూసి లోకి మురుగునీరు చేరదన్నారు. గాంధీల పేర్లు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెన్ని సంవత్సరాలు దోచుకుంటుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. మధు పార్క్ రిడ్జ్ వారికి గాంధీ సరోవరం అభివృద్ధి కోసం అపార్ట్మెంట్లు స్వాధీనం చేసుకుంటున్నట్లు మొదలు నోటీసులు ఇచ్చారన్నారు. వారు ఖాళీ చేయమని మొండికేయడంతో ఈ ప్రాంతం బఫర్ జోన్ కి వస్తుందని తర్వాత మరో నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు తప్పుదారిలో వెళ్తున్నారని ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలన్నారు.

రాజ్ నాథ్ సింగ్ కు లేఖ….
బాధితులతో మాట్లాడిన అనంతరం ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ….
ఈ ప్రాజెక్టులో కేంద్రం భాగం ఉంది అనడం పూర్తిగా అబద్దం అన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి కూడా హాజరు కావద్దని కేంద్ర హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు లేఖ రాసానని, త్వరలో వారికి పంపిస్తాను అన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ జెసిబి లు పెట్టి కూల్ చేస్తాము అంటే తామంతా ఇక్కడ బాధితుల వద్దనే నిద్రిస్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్సీలు కొమరయ్య, అంజిరెడ్డి, తోకల శ్రీనివాస్ రెడ్డి, అందే శ్రీరాములు, బండ కార్తీక రెడ్డి, శేఖర్ ముదిరాజ్, పాండు కుమార్, నాగేంద్ర ప్రకాష్ రెడ్డిలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.