- కీసర తాహసిల్దార్ అశోక్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన కీసర ముదిరాజ్ సంఘం ప్రతినిధులు.
కుషాయిగూడ (కీసర) , ముద్ర విలేఖరి: కీసర గ్రామంలోని సర్వేనెంబర్ 9 లో ఉన్న 10 గుంటల ముదిరాజ్ కులస్తుల స్మశాన వాటిక స్థలానికి హద్దురాలను ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం కీసర ముదిరాజ్ సంఘం (మత్స్య పారిశ్రామిక సహకార సంఘం) ప్రతినిధులు తాహసిల్దార్ అశోక్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా కీసర ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. కీసర సర్వేనెంబర్ 9లో 10 గుంటల విస్తీర్ణంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ముదిరాజ్ కులస్తుల స్మశాన వాటిక ఉందని తెలిపారు.గ్రామ ముదిరాజ్ కులస్తులు ఎవరు చనిపోయిన ఇక్కడే అంత్యక్రియలను నిర్వహించి సమాధులను నిర్మించినట్లు తెలిపారు. అయితే ఇటీవల స్మశాన వాటిక సమీపంలో ఉన్న భూ యజమాని కందాడి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు స్మశాన వాటిక స్థలంలోకి వచ్చి కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఇప్పటికే స్మశాన వాటికలో ఉన్న కొన్ని సమాధులను తమ స్థలంలోకి కలుపుకున్నారని వారు తెలిపారు. కావున ముదిరాజ్ కులస్తులకు చెందిన సర్వేనెంబర్ 9లో 10 గుంటల భూమికి సమగ్ర సర్వే చేపట్టి హద్దురాలను ఏర్పాటు చేయాలని తహసిల్దార్ అశోక్ కుమార్కు విన్నవించారు. దీనికి స్పందించిన ఆయన హద్దు రాళ్ళను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.