Take a fresh look at your lifestyle.

పాఠశాల గుర్తింపు రద్దు చేసే వరకు పోరాడుతాం

ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహన్

ముద్ర, షాద్ నగర్: విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన శాస్త్ర పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని, విద్యార్థి కుటుంబానికి న్యాయం జరగాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్ డిమాండ్ చేశారు. షాద్ నగర్ పట్టణంలోని శాస్త్ర పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి నీరజ్ ఆత్మహత్య సంఘటనను నిరసిస్తూ అఖిలభారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్), ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేసి విద్యార్థి కుటుంబానికి న్యాయం జరగాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్, ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ లు డిమాండ్ చేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు.

వేలకు వేలు ఫీజులు తీసుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ విద్యార్థుల శవాలను ఇంటికి పంపిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాల ముందు ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల ప్రధాన ద్వారం మూసి ఉన్నా ప్రహరీ గోడల పైనుంచి దూకి లోపలికి ప్రవేశించారు. దీంతో సిఐ విజయ్ కుమార్ తదితర సిబ్బంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, సహాయ కార్యదర్శి ఆకాష్ సాయి, నరేష్, ఆమేర్ ఆకాష్ చౌహన్, ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ పట్టణ నాయకులు సుమేర్, శివ, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.