Take a fresh look at your lifestyle.

బోనాల ఏర్పాట్లకు రూ. 20 కోట్లు

  • ఆషాఢ బోనాలకు నిధులు.
  • ఈసారి 28 దేవాలయాల్లో బోనాల ఉత్సవం.
  • ఇంకా నిధులు కావాలంటే ఇస్తాం.
  • ఈ నెల 26న తొలి బోనం.
  • ఆషాఢ బోనాల సమీక్షలో మంత్రి కొండా సురేఖ.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆషాఢ బోనాలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని, ఈసారి నిధులకు వెనకాడేది లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగ‌ళ‌వారం ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తం 28 దేవాల‌యాల్లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలని, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ పని చేయాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. బోనాల నిర్వహ‌ణ‌కు బ‌డ్జెట్ లోటు కూడా లేద‌ని, ప్రభుత్వం ఇప్పటికే రూ. 20 కోట్లు కేటాయించింద‌ని పేర్కొన్నారు. మ‌రిన్ని నిధులు అవ‌స‌ర‌మైతే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయిస్తామని, ఈ విష‌యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంద‌ని వెల్లడించారు. భ‌క్తుల‌కు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు త‌లెత్తకుండా అధికారులు చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. గ‌త ఏడాది ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాక‌ర్ స్వయంగా ఇబ్బంది ప‌డ్డార‌ని, ఈసారి అలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృత్తం కాకుండా అధికారులు ప్రత్యేక కార్యచ‌ర‌ణ రూపొందించుకొని ప‌డ్భందీగా ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి సురేఖ ఆదేశించారు.

  • జూన్ 26న‌ తొలి బోనం.

ఆషాఢ మాస బోనాలు సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని, జూన్ 26న‌ తొలి బోనం గోల్కొండలో ప్రారంభం అవుతుందని మంత్రి వెల్లడించారు. ఆ తర్వాత బల్కంపేట, ఉజ్జయిని మహంకాళీ, లాల్ దర్వాజ బోనాలు ఉంటాయని, రంగం, తొట్టెల ఊరేగింపు కూడా ఉంటుందని, అందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రులు సురేఖ, పొన్నం ప్రభాకర్​ అధికారులను ఆదేశించారు. దేవాలయాలకు ఇచ్చే చెక్స్ రెవెన్యూ , ఎండోమెంట్ కోఆర్డినేట్ చేసుకొని పండుగలకు ముందే పూర్తి చేయాలని, అధికారులు ఉద్యోగంలాగా కాకుండా సేవ చేస్తున్నామనే దృక్పథంతో పని చేయాలని మంత్రులు సూచించారు. శాంతి, భ‌ద్రత‌ల స‌మ‌స్యలు తలెత్తకుండా పోలీసులు అన్ని శాఖ‌ల‌తో సమన్వయం చేసుకోవాలని, అధికారులు ఎక్కడా లోపాలు త‌లెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో జరిగిన ఈ ఆషాడమాస బోనాల రివ్యూ మీటింగ్‌లో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆల‌య క‌మిటీల‌ చైర్మన్లు, సభ్యులతోనూ సమావేశం కొనసాగింది. ఆలయాల్లో నెలకొన్న సమస్యలపై అందరి అభిప్రాయాలు సేకరిస్తూ బోనాల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు మంత్రి కొండా సురేఖ వారికి దిశానిర్దేశం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డీజీపీ జితేందర్, ఎండోమెంట్ డైరెక్టర్ వెంకట రావు, సిపి సివి ఆనంద్, జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.