ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:
………………………………………..
దేవాలయాలు సమాజ ఐక్యత కు ప్రతీక అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మంగళవారం మహబూబ్‌నగర్ లోని సింహగిరి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం ప్రాంగణంలో ఆంజనేయ స్వామి,గరుత్మంతుడి సుధామూర్తుల విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వాదాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవాలయ అభివృద్ధి కోసం ముడా నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాల్లో గ్రీనరీ అభివృద్ధి, డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా సమాజ ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యాల కోసం అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు దేవాలయ ప్రాంగణంలో చేపడతామని తెలిపారు. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయ క్షేత్రపాలకులైన గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన జరుపుకోవడంతో ఆలయం సంపూర్ణ రూపాన్ని సంతరించుకుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని క్షేత్ర పాలకుల విగ్రహాలు ఆవిష్కరించే భాగ్యం తనకు కలగడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ ఆలయం దేదీప్యమానంగా వెలుగుతూ భక్తుల కోరికలు స్వామి వారు నెరవేర్చాలని ఆయన ఆకాంక్షించారు.దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, దేవాలయ సుందరీకరణ కమిటీ అధ్యక్షులు పోల శ్రీనివాస్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణయ్య, తిరుపతి నాయక్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………….
ప్రభుత్వ పాఠశాలల్లో
నాణ్యమైన విద్య :
…………………………………….

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కు నాణ్యమైన విద్య అందడంతో పరీక్ష ల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం లో హన్వాడ మండలంలోని కొత్తపేట పాఠశాల విద్యార్థులు పదవ తరగతి లో మంచి మార్కులు సాధించినందుకు ఎమ్మెల్యే అభినదించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.పరీక్ష ల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతాలుసృష్టిస్తున్నారన్నారు.సి. చరణ్ కుమార్ , డి. విజయలక్ష్మి, డి. రాకేష్ , ఎన్. అక్షయ , పి. కార్తిక్అనే విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంతో వారిని ఎమ్మెల్యే సన్మానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఈ సందర్బంగా ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే విద్యలో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సరైన దృష్టి పెట్టి ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందేదన్నారు. పేద విద్యార్థులు చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని, కార్పొరేట్ స్థాయిని తలదన్నే విధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. ఉపాధ్యాయులు వెనుకబడిన, పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం మరింత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం గోపాల్, ఉపాధ్యాయులు సాయినాథ్, శ్రీనాథ్, వెంకటేష్, షాబుద్దీన్, కె. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.