చేయి చేయి కలుపుదాం… హెచ్ఐవి/ఎయిడ్స్ నిర్మూలిద్దాం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా. కె. రవికుమార్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
“చేయి చేయి కలుపుదాం… హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టుతూ, ఎయిడ్స్‌ను నిర్మూలిద్దాం” అని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్ పేర్కొన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఆవరణలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ (రెడ్ రన్) నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ రవికుమార్ హాజరైన వారందరితో ప్రతిజ్ఞ చేయించి, అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెచ్ఐవి వ్యాప్తి, నివారణ, చికిత్సపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి సూచించారు. ప్రతి సమావేశంలో హెచ్ఐవి నివారణపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. హెచ్ఐవి పరీక్షల ఫలితాలు గోప్యంగా ఉంచబడతాయని, ఎవరైనా అనుమానం ఉన్నవారు ఆలస్యం చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి వరకు కొనసాగింది. నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలోని మైత్రి క్లినిక్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అలాగే జిల్లా సబ్ జైల్లో ఉన్న 6 మంది ఖైదీలకు హెచ్ఐవి, హెపటైటిస్ బి & సి, సిఫిలిస్ వంటి వ్యాధుల నిర్ధారణ కోసం రక్తపరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ రవిశంకర్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ రఫీక్, డాక్టర్ సురేష్ బాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి, వైద్యాధికారులు డాక్టర్ వాణి, డాక్టర్ సృజన, నర్సింగ్ కళాశాల అధ్యాపకులు, దిశా సిపిఎం రమేష్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, పర్యవేక్షణ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.