రూ.300 కోట్ల విలువైన స్థలం స్వాధీనం
ముద్ర, హైదరాబాద్ :
హైదరాబాద్ లో పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలో దిగి అక్రమార్కుల చేతుల్లో కబ్జాకు గురవుతున్న విలువైన భూములను స్వాధీనం చేసుకుంటున్నది. ఈ క్రమంలో తాజాగా మంగళవారం మాదాపూర్ పరిధిలోని కాకతీయ హిల్స్‌లో సుమారు రూ.300 కోట్ల విలువైన 4,090 చదరపు గజాల పార్కు స్థలంతో పాటు ఇతర కామన్ ల్యాండ్‌ను హైడ్రా కాపాడింది. నకిలీ పత్రాలతో ఈ భూములను కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నించడంతో, స్థానిక అసోసియేషన్ హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు, సంబంధిత రెవెన్యూ రికార్డులను పరిశీలించి, అక్రమ కబ్జాలపై చర్యలు చేపట్టారు. కబ్జాకు గురయ్యే ప్రమాదంలో ఉన్న స్థలాలకు కంచె ఏర్పాటు చేసి రక్షణ కల్పించారు. 1979 నాటి లేఅవుట్ నిబంధనల ప్రకారం ఈ బహిరంగ ప్రదేశాలు ప్రజావసరాల కోసం కేటాయించినవని అధికారులు స్పష్టం చేశారు. ఈ చర్యలతో స్థానికులు హైడ్రా అధికారులను అభినందిస్తూ, భవిష్యత్తులోనూ ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగించాలని కోరుతున్నారు.