- రోడ్డుపై బైఠాయించిన కవిత.
- అరెస్ట్ చేసిన పోలీసులు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. పెంచిన బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి మంగళవారం బస్ భవన్‌ను ముట్టడించేందుకు ఆమె విఫలయత్నం చేశారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ మేరకు కవిత, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కవిత ధర్నాతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటోందని విమర్శించారు. పెంచిన బస్సుల ఛార్జీలు విద్యార్థులు, ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం గుదిబండను మోపిందని ధ్వజమెత్తారు. ఈ పెంపుతో ఒక్క ప్రయాణికుడిపై నెలకు దాదాపు రూ .300 పైగా భారం పడుతుందన్నారు. ప్రజలను దోచుకోవడానికి రేవంత్ సర్కార్ అలవాటుపడినట్లుగా కనిపస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుకున్నాయని మండిపడ్డారు. పెంచిన ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనజాగృతి పక్షాన ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్‌కు కవితను తరలించడంతో జాగృతి కార్యకర్తలు సైతం భారీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
