Take a fresh look at your lifestyle.

నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం..ఫర్నీచర్ షాపులో చెలరేగిన మంటలు

అరగంట వ్యవధిలోనే నాలుగు అంతస్థులకు వ్యాప్తి
భయంతో పరుగులు పెట్టిన ప్రజలు
ఇరుకైన సందు, చుట్టూ సెట్‌బ్యాక్స్ లేమీతో రెస్క్యూకు ఇబ్బందులు
జేసీబీ, భారీ క్రేన్లతో సహాయక చర్యలు
భారీగా ట్రాఫిక్ జాం
ఆ భవనాన్ని ఖాళీ చేయించాలని గతంలోనే హైకోర్టు ఆదేశాలు
రెస్క్యూను పరిశీలించిన కలెక్టర్, సీపీ
విచారం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం
ముద్ర, హైదరాబాద్ :

హైదరాబాద్ లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని రద్దీ ప్రాంతమైన స్టేషన్ రోడ్డులోని బచ్చాస్ క్యాస్టిల్ ఫర్నీచర్ షాప్ లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మొదట భవనం కింద ఉన్న సెల్లార్‌లోని హోల్‌సేల్ ఫర్నిచర్ షాపులో మంటలు ప్రారంభమయ్యాయి. లోపల ఫర్నిచర్ సామాగ్రి అధికంగా ఉండటంతో మంటలు వేగంగా పై అంతస్తుల వరకు వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో జనం పరుగులు తీశారు. ప్రమాద సమయంలో భవనంలో ఇద్దరు నుండి నలుగురు పిల్లలు చిక్కుకున్నట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది రాకముందే స్థానిక యువకులు సాహసించి భవనంలోకి వెళ్లి పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భవనంలోని మిగిలిన కుటుంబాలను , పక్కనే ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని నివాసితులను అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ఎనిమిది ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. భవనం ఇరుకైన సందులో ఉండటం , చుట్టూ సెట్‌బ్యాక్స్ లేకపోవడంతో అగ్నిమాపక యంత్రాలు లోపలికి వెళ్లడానికి వీలు పడలేదు. దీంతో సిబ్బంది పక్కనే ఉన్న భవనాల గోడలపైకి ఎక్కి ప్రాణాలకు తెగించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రధాన రహదారిపైనే ఈ ప్రమాదం జరగడంతో నాంపల్లి నుంచి అబిడ్స్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిస్థితిని గమనించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే వాహనాల రాకపోకలను ఇతర మార్గాల్లోకి మళ్లించారు.

రంగంలోకి రోబో ఫైర్ మిషన్:
పోలీసులు, హైడ్రా, విపత్తు నిర్వహణ బృదాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. ఘటనా స్థలంలో జేసీబీ, భారీ క్రేన్లతో సహాయక చర్యలు చేపట్టినా అగ్నీకీలలు, దట్టమైన పొగ, కారణంగా సిబ్బంది లోపలికి వెళ్లేందుకు వీలుకాలేదు. దీంతో రోబో అధికారులు ఫైర్ మిషన్‍ను రంగంలోకి దింపారు. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ సహాయ చర్యలు పరిశీలించారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. సెల్లార్ నిండా ఫర్నీచర్ ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌ కష్టంగా ఉందన్నారు. అందుకు జేసీబీల సాయంతో ఫర్నీచర్ తొలగించినట్లు చెప్పారు. లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ బృందాలు చాలా కష్టపడ్డారన్నారు. బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగ అలుముకోవడంతో రెస్క్యూకు సమయం పట్టిందన్నారు. నివాస గృహాల మధ్య ఇలాంటి గోడౌన్లు, దుకాణాలు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరుగుతోందని వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇటు హైదరాబాద్ కలెక్టకర్ హరిచందన సహాయక చర్యలను పర్యవేక్షించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టమవుతోందని చెప్పారు. ఈ ప్రాంతానికి ఎవరూ రావొద్దని.. వాహనదారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు.

హైకోర్టు ఆదేశాలు బేఖాతర్
ఇరుకైన స్థలంలో నిర్మించిన ఈ భవనంలో ఏర్పాటు చేసిన దుకాణాలను తక్షణమే తొలగించాలని హైకోర్టు గతంలోనే ఆదేశాలు సైతం చేసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన అక్రమార్కులు అక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవన నిర్మాణం 1960లోనే జరిగింది. అచ్యుత్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఖాళీ స్థలం ఇవ్వగా, పలువురు దాతల విరాళాలతో హిందీ ప్రచార సభ పేరుతో నిర్మించారు. కాగా కొన్నేళ్లుగా ఆ భవనం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లింది. దీంతో అందులో షాపులు వెలిశాయి. ఈ విషయాలను జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ధృవీకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. ఇప్పటతికే దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

ఇన్ ఛార్జీ మంత్రి ఆరా
నాంపల్లిలో అగ్ని ప్రమాదం పై హైదరాబాద్ ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్,హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లతో ఫోన్ లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు విస్తరించకుండా పక్క భవనాలు ఖాళీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ ,ఫైర్ అధికారులు సమన్వయం చేసుకుంటూ మంటలు అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ ఇంజిన్స్ తో పాటు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు

Leave A Reply

Your email address will not be published.