ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికులను తీవ్రంగా శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని సీఐటీయూ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూజిల్లాలోని చాలా ప్రైవేట్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఆయా, అటెండర్, స్వీపర్, వాచ్‌మన్, డ్రైవర్ వంటి కార్మికులకు నెలకు కేవలం ₹4 వేల నుండి ₹9 వేల వరకు మాత్రమే జీతాలు ఇస్తున్నారన్నారు. పాఠశాల స్థాయిని బట్టి ₹15 వేల వరకు మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారని కనీస వేతన చట్టం ప్రకారం ఇది శ్రమ దోపిడీ అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యాలపై ఉన్నప్పటికీ, చాలా స్కూల్స్‌లో కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. అలాగే కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు. రోజుకు 9 నుండి 10 గంటల వరకు పని చేయిస్తూ, పని నిబంధనలకు విరుద్ధంగా ఇతర పనులు కూడా చేయిస్తున్నారన్నారు. సరైన జీతాలు ఇవ్వకపోవడం వల్ల
ప్రైవేట్ స్కూల్స్ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కనీస వేతనాలు అమలు చేయకపోవడం, పండుగ సెలవులు లేకపోవడం, బోనస్ ఇవ్వకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. కార్మికులు తమ హక్కుల కోసం మాట్లాడితే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని, జిల్లా కార్మిక శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ప్రైవేట్ స్కూల్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి హక్కులు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కార్మికుల హక్కులు అమలు చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించింది.